బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

బీసీలు  మరో పోరాటానికి సిద్ధం కావాలి
  • బీసీ జనసభ స్టేట్ చీఫ్​ రాజారాం యాదవ్

కరీంనగర్ టౌన్, వెలుగు: ‘మేం ఎంతో మాకు అంత’ నినాదంతో బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌‌‌‌లోని కృషి భవన్‌‌లో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యావంతుల ఆత్మీయ సమావేశానికి రాజారామ్ యాదవ్ చీఫ్​గెస్ట్‌‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ దేశ జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గుర్తు చేశారు.

 ఈ దేశంలో కులం, మతం పేరుతో రిజర్వేషన్లు కల్పించిన పాలకులు మెజార్టీ ప్రజలైన బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మండల్ కమిషన్ పోరాటాల ద్వారా బీసీలకు రిజర్వేషన్ అవకాశాలు వచ్చినా ఆధిపత్య కుల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ సైతం ఈబీసీ రిజర్వేషన్లు తెచ్చి, బీసీల గొంతు కోశారని విమర్శించారు. రాష్ట్రంలో జీవో  29  తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి  బీసీ నిరుద్యోగుల  భవిష్యత్‌‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 

మన హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్‌‌‌‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ,  బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల విజయ్‌‌కుమార్‌‌‌‌, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు మర్రి శ్రీనివాస్‌‌యాదవ్, సీనియర్ అడ్వకేట్ రాజన్న యాదవ్, సత్యనారాయణ, ప్రభాకర్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోట రాములుయాదవ్, లతా పటేల్ పాల్గొన్నారు