
- బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ నేత బత్తుల సిద్ధేశ్వర పటేల్ మంగళవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణలోని బీసీలకు విద్య, ఉద్యోగ రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులను కేంద్రప్రభుత్వం వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ ఆజాదీ జేఏసీ నేతలు జక్కని సంజయ్, ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన బీసీ ఆజాదీ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు ప్రోఫెసర్ సూరజ్ మండల్ హాజరై సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ బిల్లులను కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలు విద్యా, ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ ఎంపీ రాజారాం సింగ్ మాట్లాడుతూ.. బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలంటే వారి జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లులను ఆమోదించాలని లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.