
- 22 రోజుల దీక్షకు బ్రేక్
- కులగణన సాధించే వరకు పోరాడుతం: జక్కని సంజయ్
- మే 5 నుంచి తెలంగాణలో రిలే దీక్షలు!
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని గత 22 రోజులుగా చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్షను బీసీ నేత బత్తుల సిద్ధేశ్వర్ విరమించారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ లు సిద్ధేశ్వర్ కు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు.
బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల1న ఢిల్లీ వేదికగా బత్తుల సిద్ధేశ్వర్ దీక్షకు దిగారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తాత్కాలికంగా దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా అనిల్ జైహింద్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రం కులగణనపై తన వైఖరీని చెప్పాలన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా బీసీల పోరాటాన్ని బలోపేతం చేస్తామని బీపీ మండల్ మనువడు ప్రొఫెసర్ సూరజ్ హెచ్చరించారు.
బీసీల వాటా తేల్చాలి: తీన్మార్ మల్లన్న
తెలంగాణ బీసీ బిల్లును 9వషెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. లేదంటే బీసీలంతా ఒక్కటై బీజేపీని గద్దె దించుతారని హెచ్చరించారు. అలాగే.. తెలంగాణలో బీసీల వాటాను అమలు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా కులగణన జరిగే వరకు పోరాటం చేస్తామని జక్కని సంజయ్ స్పష్టం చేశారు. మే 5 నుంచి తెలంగాణలో బీసీల పల్లె బాట ప్రొగ్రామ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీల నియోజకవర్గాల్లోనే రిలే దీక్షలు చేపడుతామని పేర్కొన్నారు.