బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి

  • రాజ్యాంగ సవరణకు కేంద్రానికి సిఫారసు చేయండి: ఆర్ కృష్ణయ్య
  • బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్​కు వినతిపత్రం అందజేత  
  • కోర్టులు అడ్డుకుంటే లీగల్​గా పోరాడుతామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందేనని మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కులగణనలో అందరి లెక్కలు వస్తాయని, వాటి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలన్నారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, కమిషన్ సెక్రటరీ సైదులుకు బీసీ సంఘాల నేతలతో కలిసి ఆర్ కృష్ణయ్య వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయప మీడియాతో మాట్లాడారు. 

లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ పై తాను సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశానని.. వాటి ఫలితంగానే కులగణన చేసి, డెడికెటెడ్ కమిషన్ సిఫార్సుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకునేలా జడ్జిమెంట్ ఇచ్చిందన్నారు.రాజ్యాంగ సవరణ చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని చైర్మన్ ను ఆర్ కృష్ణయ్య కోరారు. రిజర్వేషన్ల పెంపును కోర్టులు అడ్డుకుంటే సీనియర్ న్యాయవాదులతో పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు తగ్గించడంతో వేల మంది లోకల్ బాడీల పదవులకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   చైర్మన్ ను కలిసిన వారిలో బీసీ నేతలు గుజ్జకృష్ణ, సత్యం, మల్లేశం, రామకృష్ణ, సతీశ్​తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

జిల్లాల్లో మంచి స్పందన: కమిషన్ చైర్మన్ బూసాని

హైదరాబాద్ తో పాటు మరో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించామని.. పబ్లిక్, బీసీ సంఘాల నుంచి మంచి స్పందన వచ్చిందని చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కో జిల్లాలో 80 వినతిపత్రాలు వచ్చాయన్నారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తి చేశామని ఆయన మీడియాకు తెలిపారు. 

బుధవారం అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలతో మీటింగ్ నిర్వహిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆయన  సూచించారు. త్వరలో మిగతా ఐదు ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ నెల 21న హన్మకొండ కలెక్టరేట్​లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని, ప్రజలు, బీసీ సంఘాల నేతలు తమ అభిప్రాయాలు చెప్పాలని చైర్మన్ కోరారు.