బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి: ఆర్.కృష్ణయ్య

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: జనాభా పరంగా దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. గురువారం హైదరాబాద్‌ విద్యానగర్‌‌లోని బీసీ భవన్‌లో బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అధ్యక్షతన బీసీల స్థితిగతులపై జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య హాజరై, మాట్లాడారు. దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం అన్నారు. బీసీల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని.. చదువుకుంటే హక్కులను సాధించుకోవచ్చని చెప్పారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్న అందరికీ అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ, దేశ ప్రగతి, బీసీల అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి బాధ్యత పాలకులపైనే ఉందన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, నందగోపాల్, జంపాల ప్రతాప్, మోదీ రాందేవ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాజ్యసభకు నామినేషన్ వేసిన ఆర్.కృష్ణయ్యను వివిధ బీసీ సంఘాల నాయకులు సత్కరించారు.