ముషీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల, కొండకల్ గ్రామాలకు చెందిన 80 ఎకరాల గిరిజనుల భూమిని కొమ్మారెడ్డి, విక్రమ్ రెడ్డి, అరబిందో ఫార్మా, అపర్ణ కంపెనీ కాజేయాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.
అవి170 మంది లంబాడి కుటుంబాల భూములని..వాటిని కాజేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. భూములను ఆక్రమించాలని చూస్తున్న బడా బాబులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే అన్ని ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు, గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.