లోకల్​బాడీల్లో బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందే

లోకల్​బాడీల్లో బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందే
  • పార్లమెంటులో బిల్లు పెట్టేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలి
  • ఆ విషయంలో రాహుల్  నిబద్ధతతో ఉన్నారని కితాబు
  • కోటా కోసం ఉమ్మడిగా కృషి చేయాలి: ఎమ్మెల్సీ కోదండరాం
  • బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్  మీటింగ్

హైదరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: లోకల్​బాడీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, ఇందుకు కాంగ్రెస్​ సర్కారు కృషిచేయాలని  బీసీ సంఘాల నేతలు, మేధావులు డిమాండ్  చేశారు. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని లోక్ సభలో  ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ప్రకటించడం అభినందనీయమని, ఈ అంశంపై ఆయన నిబద్ధతతో ఉన్నారని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. కులగణనకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలని, ఇందుకు రాహుల్  చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

బిల్లు పెడితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. లోకల్  బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్​తో తెలంగాణ జన సమితి  బీసీ సెల్  ప్రెసిడెంట్  జశ్వంత్ కుమార్  అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్  లో సోమవారం రౌండ్ టేబుల్  సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు పలు పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఎంపీ  కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. ఎమ్మెల్సీ కొదండరాం చొరవ తీసుకుని  కులగణన ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రికి  వివరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేలా చూడాలని  కృష్ణయ్య కోరారు.

 76 ఏళ్లుగా బీసీలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారని, ఇప్పటికైనా కులగణన చేపట్టక పోతే తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కులగణన దేశవ్యాప్త అంశంగా మారిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. కులగణన చేపట్టిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్  చేశారు. కులగణనను బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రధాని వ్యతిరేకిస్తుంటే.. రాహుల్​ గాంధీ అనుకూలంగా ఉన్నారని జాజుల పేర్కొన్నారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్

గత ప్రభుత్వం బీసీ కోటాను తగ్గించింది

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ సాధించేందుకు అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎమ్మెల్సీ కోదండరాం  అన్నారు. కార్పొరేట్ ​చక్రబంధంలో బీసీలు చిక్కుకున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్  పార్టీ చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్  పూర్తిగా అమలు చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాహుల్ గాంధీ ​ ఇచ్చిన మాటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వెంటనే కులగణన చేపట్టాలని కోదండరాం అన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్  ఉపాధ్యక్షుడు  విశ్వేశ్వరరావు, బీసీ నేతలు నరేందర్ గౌడ్, గుజ్జ కృష్ణ, భైరి రమేష్,​ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.