
- 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరుగర్జన ధర్నాకు హాజరుకండి
- అఖిలపక్ష పార్టీలకు బీసీ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరు గర్జనకు అఖిలపక్ష పార్టీల నేతలు హాజరై, బీసీలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయా రాజకీయ పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీజేఎస్ చీఫ్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని బీసీ నేతలు వారి పార్టీ ఆఫీసుల్లో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్త జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని, దీంతో వారిని స్వయంగా కలిసి ధన్యవాదాలు చెప్పామన్నారు. పార్లమెంట్‌లో కూడా బీసీ బిల్లు ఆమోదించే వరకు తమ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బీసీల ఓట్లతో గెలిచి చట్ట సభల్లోకి వెళుతున్న రాజకీయ పార్టీల నేతలు బీసీ బిల్లు ఆమోదించడం ద్వారా బీసీల రుణం తీర్చుకోవాలన్నారు.
పార్టీల నేతలను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రం గౌడ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్, సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు శేఖర్ సగర తదితరులు పాల్గొన్నారు.