- బీఆర్ఎస్లో బీసీలు గెలుస్తున్నా కాంగ్రెస్‌లో అపజయాలు
- బీసీ నేతల ఓటమి వెనుక అదృశ్య ‘హస్తాలు’
- రూలింగ్ పార్టీలో సిట్టింగుల పైనా కాలు దువ్వుతున్న ఓసీలు
- ఈసారి బీసీలకు టికెట్లు రాకుండా తెర వెనుక ప్రయత్నాలు
నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి నేతల రాజకీయాలకు బీసీ లీడర్లు బలవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నికలు రాగానే బీసీ జెండాను భుజాన వేసుకుని ప్రచారం చేసే కాంగ్రెస్‌లోని సీనియర్లు తమ గెలుపునకు సహకరించకపోగా, ఓటమికి కారణమవుతున్నారని బీసీ లీడర్లు ఆరోపిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో బీసీ లీడర్షిప్ బలంగా లేదని, అందువల్లే ఆ సామాజిక వర్గం నేతలు ఓడిపోతున్నారని సీనియర్లు ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే బీఆర్ఎస్లో టికెట్లు పొందిన బీసీ నేతలు ఎందుకు గెలుస్తున్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో మరోసారి సీట్లు దక్కించుకున్న బీసీ ఎమ్మెల్యేలపై అసమ్మతిని ఎగదోస్తున్న ఓసీ లీడర్ల తీరు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ నుంచి గెలిచిన బీసీ లీడర్ ఒక్కరే..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్తరుపున బీసీ లీడర్ గెలిచింది ఒక్క 2009 ఎన్నికల్లోనే! ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీసీ క్యాండేట్లకు ఓటమే ఎదురైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమానాలో 2009 ఎన్నికల్లో తొలి, చివరిసారిగా ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి శిష్యుడు కావడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. వైఎస్, పురుషోత్తం రెడ్డి మరణించాక భిక్షమయ్యగౌడ్.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోటరీలో చేరారు. అప్పటికే జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా నడుస్తోంది. తిరిగి 2014 ఎన్నికల్లో ఈక్వెషన్స్ ప్రకారం జిల్లాలో భువనగిరి, ఆలేరు సీట్లను బీసీలకు కేటాయించారు. భువనగిరి నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్ పోటీ చేశారు. కానీ, భువనగిరి కాంగ్రెస్ టికెట్ రెడ్లకు దక్కలేదన్న కోపంతో ఆ వర్గం లీడర్లు వైరి వర్గంతో చేతులు కలిపారు.
దీంతో వెంకటేశ్వర్లు ఓడిపోయారు. ఇక ఆలేరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఉన్న విభేదాల వల్ల భిక్షమయ్యగౌడ్ఓడిపోయారు. భిక్షమయ్యను ఓడించేందుకు కాంగ్రెస్‌లోని రెడ్డి సామాజిక వర్గం లీడర్లు కలిసికట్టుగా కుట్ర పన్నా రని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యతిరేకత 2018 ఎన్నికల వరకు కొనసాగింది. దీంతో ఆ ఎన్నికల్లోనూ భిక్షమయ్యగౌడ్ రెండోసారి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, సాగర్ అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్ఎస్ బీసీ లీడర్లను బరిలో దింపడంతో పోటీగా కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానాన్ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కేటాయించింది. కానీ, రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ రాలేదనే కారణంతో పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఫలితంగా ఆర్.కృష్ణయ్య ఓటమిపాలయ్యారు.
బీఆర్ఎస్లో బీసీలు సక్సెస్..
నల్గొండ జిల్లాలో బీసీ లీడర్లు బలంగా లేకపోవడం వల్లే ఓడిపోతున్నారని కాంగ్రెస్సీనియర్లు తరుచూ వాదిస్తున్నారు. ఈసారి కూడా హైకమాండ్ దగ్గర ఇదే విషయం చెప్పి టికెట్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీసీ లీడర్లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశాలున్నాయి. ఇదే జరిగితే తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయోనని భయపడ్తున్న సీనియర్లు పాత వాదనను తెరపైకి తెస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోని బీసీ లీడర్లు మాత్రం సీనియర్ల తీరుపై మండిపడ్తున్నారు.
జిల్లాలో బీసీ నేతలు బలంగా లేకపోతే బీఆర్ఎస్నుంచి ఎలా గెలుస్తున్నారని నిలదీస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నాగార్జునసాగర్నుంచి నోముల నర్సింహయ్యకు చాన్స్ ఇచ్చింది. 2014లో ఓడిపోయిన నర్సింహయ్య 2018లో జానారెడ్డిపై గెలిచారు. నర్సింహయ్య మరణించాక జరిగిన బైపోల్‌లోనూ ఆయన తనయుడు భగత్ గెలిచారు. ఇక కోదాడలో ఫస్ట్‌టైం 201 8 లో బీసీలకు అవకాశం ఇవ్వడంతో అక్కడ బొల్లం మల్లయ్య యాదవ్ గె లిచారు. రెడ్లు ఆధిపత్యం చెలాయించే సా గర్, కోదాడలో బీసీ క్యాండిడేట్లు సత్తా చాటారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి తండ్రీకొడుకుల చేతుల్లో ఓటమిపాలయ్యారని, పీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడలో ఓడిపోయారని కాంగ్రెస్ లోని బీసీ లీడర్లు గుర్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్లో సిట్టింగ్‌ల ఓటమిని కోరుకుంటున్న ఓసీ లీడర్లు..
మరోవైపు బీఆర్ఎస్లోనూ బీసీ ఎమ్మెల్యేల పైన ఓసీ లీడర్లు చేస్తున్న కుట్ర రాజకీయాలు వివాదాస్పదమవుతున్నాయి. కోదాడ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్‌లను మార్చాలని, లేదంటే తమ సత్తా చూపిస్తామని కోదాడలో మాజీ ఎమ్మెల్యే చందర్రావు, కన్మంత శశిధర్ రెడ్డి, ఎర్నేని బాబు హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యే మీదికి అసమ్మతి నేతలను రెచ్చగొడ్తున్న తీరు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాగర్‌లో భగత్‌కు టికెట్ ఇస్తే తాము సపోర్ట్ చేయమని రెడ్డి వర్గం నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో జానారెడ్డికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు.
మాటమార్చిన వెంకట్‌రెడ్డి
మొన్నటి వరకు బీసీల కోసం అవరమైతే తన సీటు త్యాగం చేస్తానని చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చి నల్గొండ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. సీనియర్లు పంచుకోగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో బీసీలకు మిగిలింది ఒక్క మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం మాత్రమే! కానీ దానిని కూడా రెడ్డి వర్గానికే ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. భువనగిరి ఎం పీ సెగ్మెంట్లో ఎప్పట్లాగే ఆలేరు స్థానాన్ని బీసీలకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటే భువనగిరి స్థానాన్ని కూడా బీసీలకు ఇస్తామని వెంకటరెడ్డి ప్రకటించారు. కానీ, ఇటీవల పార్టీలో జిట్టా బాలకృష్ణారెడ్డి చేరడంతో భువనగిరి టికెట్ బీసీలకు దక్కుతుందా? లేదా? అనేది తేలడం లేదు. ఆలేరులో బీర్ల అయిలయ్య రేసులో ఉన్నారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ వెంకటరెడ్డి అండదండలున్న బీర్ల అయిలయ్యకు టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. కానీ ఆయన గెలుపునకు రెడ్డి సామాజికవర్గం లీడర్లు ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.