బడ్జెట్​లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించాలి

బడ్జెట్​లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించాలి
  • దేశవ్యాప్తంగా కులగణన చేయాలి
  • బీసీ సంఘాల భేటీలో వక్తల డిమాండ్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్​లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్​ చేశారు. కాన్షీరాం  జయంతి సందర్భంగా శనివారం బేగంపేట టూరిజం ప్లాజాలో  జాజుల శ్రీనివాస్  గౌడ్  అధ్యక్షతన బీసీ సంఘాలు,  మేధావుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.  ‘సామాజిక న్యాయమే బీసీ వాదం’  పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధుయాష్కి గౌడ్  మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.  బీసీ బిడ్డల కోసం సమష్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

మనమెంతో మనకంత వాటా కావాలని, అందుకోసం మనం ఎంత మంది ఉన్నామో తెలియాలని బీసీ కమిషన్  మాజీ చైర్మన్  వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. దేశం బాగుపడాలంటే బహుజన రాజ్యాధికార ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్  గౌడ్ తెలిపారు.  జాజుల శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ బీసీ వాదంతోనే ఓటేశారన్నారు. బీసీ సబ్ ప్లాన్  అమలు అయ్యేలా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్​ చేశారు. 

ప్రొఫెసర్  మురళీ మనోహర్  మాట్లాడుతూ.. బీజేపీని తట్టుకోవాలంటే కులగణన తోనే సాధ్యం అవుతుందన్నారు. కరీంనగర్  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ  మాట్లాడుతూ.. బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత  అందరిపై ఉందని పేర్కొన్నారు. మినరల్  కార్పొరేషన్  చైర్మన్,  మాజీ ఎమ్మెల్యే అనిల్  మాట్లాడుతూ  ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే కాన్షీరం పోరాట ఫలితమే అన్నారు.