మా వాటా మాకివ్వాలి : బీసీ నేతలు

మా వాటా మాకివ్వాలి : బీసీ నేతలు
  • విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి
  • బీసీల మేధోమథన సదస్సులో వక్తల డిమాండ్ 
  • బీసీలు ఉద్యమబాట పట్టాలి: జస్టిస్ ఈశ్వరయ్య 
  • కులగణన సర్వే సరిగా చేయలేదు: ప్రొఫెసర్ మురళీ మనోహర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, తమ వాటా తమకు ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కులగణన సర్వే, రిజర్వేషన్లపై హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కళింగ భవన్ లో బుధవారం మేధోమథన సదస్సు నిర్వహించారు. దీనికి జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించిన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్లు కల్పించాలి.

 అవి చట్టప్రకారం అమలు చేయాలి. కేవలం పార్టీల పరంగా అమలు చేస్తామంటే ఊరుకోం” అని హెచ్చరించారు. 1989 నుంచి తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. ఉద్యమ బాట పడితేనే బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయన్నారు. ‘‘బీసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. సమగ్ర కులగణన చేసి, వివరాలను దాచిపెట్టింది. నాటి పాలకులు రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతున్నారో వివరాలు సేకరించి... ఎలా పాలించాలో తెలుసుకున్నారు తప్ప, వాటితో చేసిందేమీ లేదు” అని అన్నారు. 

కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ కన్వీనర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని అనేక ఉద్యమాలు చేశాం. కాంగ్రెస్​చాలాకాలం పాటు నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు కులగణన చేసింది. కానీ అది హడావిడిగా పూర్తిచేసి, సరిగ్గా లెక్కలు తియ్యలేదు. ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు బయటపెట్టాలి. రిపోర్టులోని తప్పులను సవరించాలి” అని కోరారు. 

తప్పులను సరిచేసుకోవడానికి చాన్స్ ఇస్తున్నాం: తీన్మార్ మల్లన్న 

కులగణన లెక్కల్లో పొరపాటు జరిగితే, సరిచేసుకోడానికి ప్రభుత్వానికి చాన్స్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. ‘‘బీసీలకు పార్టీలు ఇచ్చే సీట్లు బిచ్చం కాదు.. అవి మన హక్కు. బీసీలకు రిజర్వేషన్లు ఇయ్యని పార్టీకి ఓటు వేయొద్దు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలనే గెలిపించాలి” అని పిలుపునిచ్చారు. పార్టీలు వేరైనా తమ లక్ష్యం ఒక్కటేనని, బీసీల గొంతుపై కాలు పెడితే దాన్ని తీసేస్తామని హెచ్చరించారు. ఇది మరో తెలంగాణ ఉద్యమమని పేర్కొన్నారు. 

వాళ్లే బీసీలను ఏలుతున్నరు: విశారదన్ 

రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 10% లోపే ఉన్నదని, కానీ వాళ్లే బీసీలను ఏలుతున్నారని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ చెప్తుంటే, ఆయన మాటలను సీఎం రేవంత్ రెడ్డి వినడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 3.50 కోట్ల మంది ఉంటారని.. ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ప్రజాయుద్ధం వస్తేనే ప్రభుత్వంలో కదలిక 
వస్తుందన్నారు. 

బీసీలను ఎవరూ ఆపలేరు: జాజుల  

బీసీల రాజకీయ శకం మొదలైందని, దీన్ని ఎవరూ ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘‘జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే సరి.. లేదంటే ఉద్యమం చేస్తాం.. కొట్లాడుతాం.. సాధించుకుంటాం’’ అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రెడ్ల పాలన నడుస్తున్నదని విమర్శించారు. ‘‘రెడ్లను గెలిపించింది బీసీలే.. జెండాలు మోసింది, ఓట్లేసింది బీసీలే.. 60% ఉన్నోళ్లం 10 శాతం ఉన్నోళ్లకి సలాం చేసుడేంది.. బీసీలు ఓట్ల ద్వారా రెడ్ల పాలనకు స్వస్తి పలకాలి” అని పిలుపునిచ్చారు. ‘‘11 శాతం ఉన్న మాదిగలు లక్ష డప్పులు కార్యక్రమం అనగానే సీఎం రేవంత్ వణికిండు.. మరి 60 శాతం ఉన్న బీసీలం పోరాడితే ఇక ఎట్లుంటదో ఆయన తెలుసుకోవాలి’’ అని అన్నారు.

 కులగణన సర్వే వివరాలు అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, వాళ్లందరి వివరాలు సేకరించాలని కోరారు. సర్వేలో పాల్గొనని వాళ్లు వివరాలు ఇచ్చే విధంగా ఒక మొబైల్ యాప్ రూపొందించాలని బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు సూచించారు.