
మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టికెట్‌పై బీసీ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయా ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో నిల్చేందుకు సై అంటున్నారు. టికెట్ల కోసం ఎవరి స్థాయిలో వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకర్గ ప్రజల దృష్టిలో పడేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఏ పార్టీ నుంచి ఎవరెవరు?
బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో సైతం మళ్లీ పోటీకి సై అంటుండగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. కాగా బీసీ కోటాలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ను ఎంపీపీల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ల ఫోరం స్టేట్ సెక్రటరీగా, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. వరుసగా రెండు సార్లు 2014, 2018లో శివ్వంపేట ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్పార్టీ హైకమాండ్‌లో తనకున్న పరిచయాల ద్వారా హరికృష్ణ బీసీ కోటాలో టికెట్ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నర్సాపూర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి గత రెండు ఎన్నికల్లో పోటీ చేయగా రానున్న ఎన్నికల్లో సైతం మళ్లీ పోటీ చేసేందుకు టికెట్ఆశిస్తున్నారు. కాగా ఈ సారి బీసీ కోటాలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రగొళ్ల మురళీ యాదవ్ టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నారు. మురళీ యాదవ్ గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఆయన భార్య రాజమణి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేశారు. కాగా మురళీ యాదవ్ తో పాటు బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాల్డాస్ మల్లేశ్ గౌడ్ సైతం బీసీ కోటాలో తనకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీ అభ్యర్థులకు కేటాయించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా, కాంగ్రెస్ స్టేట్జనరల్ సెక్రటరీగా, నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనిల్ కుమార్ కూడాఈ స్థానంపై దృష్టి పెట్టారు. ఆయన సొంత నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాగా అక్కడ పోటీకి చాన్స్ దొరకకుంటే ఈ టికెట్ అడిగే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అవకాశం దొరికినపుడల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్ని మండలాల్లో పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మరో నాయకుడు సోమన్నగారి రవీందర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు.