పేటపై బీసీ లీడర్ల నజర్!

  •     సగానికిపైగా ఓటర్లు ఉన్నా ఆ వర్గానికి దక్కని ప్రాధాన్యం
  •     పార్టీ ఏదైనా ఈ సారి టికెట్‌ ఇవ్వాల్సిందేనని డిమాండ్
  •     చాన్స్‌ ఇవ్వకుంటే బీఆర్‌‌ఎస్‌ను వీడే యోచనలో కొందరు
  •     ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు

సూర్యాపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండంతో సూర్యాపేట సీటుపై బీసీ లీడర్లు నజర్ పెట్టారు. ఈ సెగ్మెంట్‌ నుంచి 1952లో మినహా ఇప్పటి వరకు ఆ వర్గానికి అవకాశం దక్కలేదు.  ప్రతి ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. పార్టీలు మాత్రం అగ్రవర్ణాలకే చాన్స్‌ ఇస్తున్నాయి.  ఈ సారి మాత్రం రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వాలనే నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పేట నేతలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఇప్పటికే హైకమాండ్లను ఒప్పించే పనిలో పడ్డారు. అధికార పార్టీలోని కొందరు బీసీలు తమకు అవకాశం ఇవ్వకపోతే  పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.  అంతేకాదు బీసీ నాయకులంతా కలిసి అఖిలపక్షం పేరిట సమావేశాలు నిర్వహిస్తుండడం ప్రధాన పార్టీలకు వణుకు పుడుతోంది.  

సగానికిపైగా బీసీలే

2018 లెక్కల ప్రకారం నియోజక వర్గంలో 2.40లక్షల ఓటర్లు ఉండగా 1.28 లక్షలు బీసీ ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరో12వేల మంది బీసీ ఓటర్లుగా నమోదయ్యారు. కానీ, ఇక్కడ1952 లో బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్  మాత్రమే బీసీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం ఎస్సీ రిజర్డ్‌గా మారింది.  2009లో జనరల్ సీట్‌గా మారినప్పటికీ ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే అవకాశం ఇచ్చాయి.  2009,2014,2018 ఎన్నికల్లోనూ రెడ్డి అభ్యర్థులే గెలిచారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి రెండు, మూడు అసెంబ్లీ టికెట్లు బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానించిన విషయం తెలిసిందే.  ఇందులోభాగంగా ఈ సారి బీసీలకు చాన్స్‌ ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీలు సైతం బీసీ నేతనే క్యాండిడేట్‌గా నిలబెట్టాలని అప్పీల్ చేస్తున్నారు. 

ప్రయత్నాలు ముమ్మరం

బీసీ నినాదం తెరపైకి రావడంతో పేటలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.  ఇప్పటికే పలువురు నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీలోని యాదవ సంఘానికి చెందిన ఒక ముఖ్య నేత  దర్బార్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సమయంలో  భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడా సిద్ధమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఎస్పీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఆయన బాటలోనే మరో బీసీ నేత

అధికార పార్టీలోని మరో కీలక నేత కూడా అధికార పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు టాక్‌ నడుస్తోంది.  గతంలో మున్సిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఆయనను రెండోసారి అధికారంలోకి వచ్చాక పక్కకు పెట్టడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.  దీంతో  మొదట వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కానీ,  వైఎస్సార్‌‌టీపీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన జిల్లా వ్యాప్తంగా బీసీ సమ్మేళనాలు కూడా నిర్వహించారు. నాలుగు నెలల కింద పార్టీ మారుతారని ప్రచారం జరిగింది కానీ, హైకమాండ్ టికెట్‌ ఇవ్వకపోతే అప్పుడు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో పార్టీలోనే కొనసాగుతున్నారు. వేచిచూద్దామనే దోరణిలో ఆయన ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తారని  ఆయన అనుచరులు చెబుతున్నారు.  వీరితో పాటు విద్యార్థి సంఘాలకు చెందిన ఇద్దరు బీసీ నేతలు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.