చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

బీసీలను తొక్కేస్తున్నరు

‘‘తెలంగాణలో 91 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణను బడుగుల రాష్ట్రంగా ప్రకటించి, ఈ కులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం’’ అని ఉద్యమం టైమ్‌‌లో సీఎం కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో చెప్పే వారు. కానీ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ సర్కారు పవర్‌‌లోకి వచ్చి ఆరేండ్లు అయింది. ఈ ఆరేండ్లలో బీసీ కులాల అభివృద్ధికి ఎలాంటి కొత్త స్కీములు పెట్టలేదు. ఉన్న స్కీములను సక్కగ అమలు చేయట్లేదు. అడుగడుగునా ఈ కులాలను కుట్ర పూరితంగా దెబ్బతీస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఈ కులాల్ని అడుగడుగునా అణచివేస్తున్నరు.”

పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించి బీసీల నాయకత్వాన్ని ఎదగకుండా దెబ్బ తీశారు. నిజానికి టీఆర్ఎస్ సర్కారు సుప్రీంకోర్టులో బీసీల కేసు వాదించకుండా వాపస్‌‌తీస్కొని బీసీలకు అన్యాయం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. అదీ గాక ఇంకేవేవో తప్పుడు లెక్కలు చూపి కేవలం18 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.  మొత్తం గ్రామపంచాయతీలు 12751  కాగా 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 6822  గ్రామ పంచాయతీలు దక్కాలి. గతంలో లెక్క 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే 4300 పంచాయతీలో బీసీలకు దక్కాలి. కానీ 2332 మాత్రమే కేటాయించిన్రు. అంటే 18 శాతం మాత్రమే దక్కాయి. దీంతో రెండు వేల గ్రామ సర్పంచులు, 23వేల వార్డు మెంబర్లు బీసీలకు దక్కాల్సినవి దక్కకుండా పోయాయి. అట్లనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల్ పరిషత్ చైర్మన్ పదవులల్ల కూడా బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 తగ్గించి బీసీల నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అణచివేశారు.

చదువుకుంటే చైతన్యమొస్తదని..

ఇక ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కూడా 20 ఏండ్లుగా పాటిస్తున్న జీవో 550 ప్రకారం ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఈ కులాలకు అన్యాయం చేస్తోంది. ఉమ్మడి ఏపీలో బీసీల సంక్షేమానికి ఏటా 3.5%  బడ్జెట్ కేటాయించేవారు. టీఆర్‌‌ఎస్‌‌సర్కారు దాన్ని 1.8 శాతానికి తగ్గించింది. బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌‌ను రూ.50 కోట్ల నుంచి రూ.10 కోట్లకు తగ్గించింది. ఇంజినీరింగ్ మెడిసిన్, ఫార్మసీ, పీజీ కోర్సులు చదివే బీసీ స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్ స్కీమ్‌‌ను సక్కగ అమలు చేస్తలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఫుల్‌‌ఫీజులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మైనారిటీలకు పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. మైనార్టీలకు ఇచ్చి బీసీలకు ఇవ్వకపోవడం అన్యాయం కాదా! బీసీల్లో అత్యంత వెనకబడిన కులాలు, సంచార జాతులు, భిక్షాటన చేసే కులాలు ఉన్నవి. ఈ కులాల స్టూడెంట్లు ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత లేక చదువు మానుకుంటున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో కొన్ని వర్గాలకు ఇచ్చి… కొన్ని కులాలకు ఇవ్వడం లేదు. కిందటేడాది ఫీజుల బకాయిలను 800 కోట్ల రూపాయలు చెల్లిస్తలేదు. ఈ ఏడాది రూ.2200 కోట్లు విడుదల చేయలేదు. దీంతో కాలేజీలు పిల్లల్ని క్లాసులకు రానిస్తలేవు, సర్టిఫికెట్లు ఇస్తలేవు. అట్లనే బీసీల విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై క్రీమిలేయర్  విధించొద్దని బీసీ కులాలు ఎంత మొత్తుకున్నా.. ఈ టీఆర్ఎస్ సర్కారు బీసీలపై కసిదీరా క్రిమిలేయర్ విధించి అన్యాయం చేసింది. ఉన్నత చదువులు చదువుకుంటే పేద కులాల్లో చైతన్యం వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడుతారని ఈ దొరల ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి.

బీసీ పిల్లలకు పాకెట్‌‌మనీ సూత ఇయ్యరా..

వాస్తు కోసం మంచి బిల్డింగ్‌‌లు కూలగొట్టి వందల కోట్లతో కొత్తవి కడ్తమనే సర్కారుకు ఈ ఆరేండ్లలో పేద బీసీ పిల్లలు చదువుకునే ఒక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌‌, కాలేజీ హాస్టల్ కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు. ఎస్సీ, ఎస్టీ కాలేజీ హాస్టల్ లకు నెలకు 500 రూపాయలు పాకెట్ మనీ ఇస్తూ, బీసీలకు ఇవ్వకపోవడం అన్యాయమని అనిపిస్త లేదా? ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు మంచాలు, నోటుబుక్కులు, వాటర్ ప్లాంట్, గేమ్స్, స్పోర్ట్స్ మెటీరియల్, టీవీ, హాస్టల్ రిపేర్లు, బెడ్ షీట్లు ఇచ్చి బీసీ పిల్లలకు ఇవ్వకపోవడమేంటి? ఆఖరుకు పిల్లల చదువులు, సౌలత్‌‌ల విషయంలో కూడా ఇంత వివక్ష చూపుతారా? ఇలా బీసీలను అడుగడుగునా తొక్కేయడానికి చేస్తున్న కుట్ర క్లియర్‌‌గా కనిపిస్తోంది. రిజర్వేషన్లు తగ్గించడం, తగ్గించిన రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయకపోవడం, రాజకీయంగా బీసీల నాయకత్వాన్ని దెబ్బ తీయడం, చదువు కోకుండా చేయడం, జాబులు భర్తీ చేయకుండా ప్రాతినిథ్యం తగ్గించడం, బడ్జెట్ తగ్గించడం లాంటి చర్యలతో ఒక పద్ధతి ప్రకారం అణచివేస్తున్నారు.

210 తీర్మానాలు ఎటు పోయినయో..
బీసీల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకురావడానికి సీఎం కేసీఆర్ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో 2017 డిసెంబర్‌లో 3 రోజులు చర్చించి 210 తీర్మానాలు ఆమోదించిన్రు. బీసీల బ్రతుకులలో విప్లవాత్మకమైన అభివృద్ధి కోసం ఈ మీటింగ్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని వీటిని ఉన్నదున్నట్టు అమలు చేస్తామని ప్రకటించారు. మూడేండ్లు అయితున్నా కేసీఆర్‌‌ ఆ తీర్మానాల ఊసే ఎత్తడం లేదు.

చెత్తబుట్టలో 8.7లక్షల బీసీ లోన్‌‌ దరఖాస్తులు
బీసీల సెల్ఫ్ ‌‌ఎంప్లాయిమెంట్‌‌ కోసం 1974లోనే బీసీ కార్పొరేషన్, 2007–2008లో 12 బీసీ కులాల ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి దాక ఉన్న ప్రభుత్వాలు 40 లక్షల మందికి సబ్సిడీలోన్లు, మార్జిన్ మనీ లోన్లు ఇచ్చాయి. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఈ సంస్థ ద్వారా రెండే రెండు సార్లు బీసీల నుంచి దరఖాస్తులు తీసుకున్రు. 2015లో 2 లక్షల 93 వేల మంది, 2017–18లో 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు పెట్టుకున్రు. వీళ్ల లోన్ల కోసం రూ.10వేల కోట్ల బడ్జెట్‌‌ కేటాయిస్తమని అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రకటిం చారు. కానీ ఎలక్షన్లు కాంగనే ఈ దరఖాస్తులన్ని చెత్తబుట్టలో పడేసిన్రు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు కేటాయించి ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన పీడీ అకౌంట్లోని రూ.400 కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌‌ చేసిన్రు. టీఆర్‌‌ఎస్‌‌ సర్కారు అధికారంలోకి రాగానే బీసీలకు ఖర్చు పెట్టాల్సిన ఆ డబ్బును మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేసింది.

– ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు,

జాతీయ బీసీ సంక్షేమ సంఘం

For More News..

చెప్పినదేంది.. చేస్తున్నదేంది?

జనం కోసమే తెలంగాణ

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..

ఆరేండ్లలో ఎంతో సాధించినం