బీసీ ఉద్యమాలు వ్యక్తి కేంద్రాలుగా కాకుండా.. శక్తి కేంద్రంగా, కేంద్రాలుగా ఎదగాలి. వ్యక్తి ఉద్యమాలుగా ఉన్నంతకాలం బీసీల రాజ్యాధికారం ఓ ఎండమావి మాత్రమే. బీసీ కులాల ఐక్యత బీసీ నాయకుల సఖ్యతతో ఇది సాధ్యం.
ఇవి ఏవీ చేయకుండా చెప్పే మాటలన్నీ భ్రమల్లో ముంచటమే అవుతుంది. అప్పటిదాకా 5 శాతం ఉన్నవాళ్లకు 60 శాతం ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్ ఇస్తూనే ఉంటారు. 60 శాతం బీసీలకు 5 శాతం సీట్లు ఇస్తారు. 5 శాతం నుంచి .. అర శాతం ఉన్న కులాల చేతిలో దశాబ్దాలుగా పాలన ఉందంటే, ప్రజల్లో కాకుండా, పత్రికల్లోనే బీసీ ఉదమాలు ఉండటం, నీటి మీద రాత లాంటి ఉద్యమాలు, బీసీ కులాలు ఐక్యంగా లేకపోవడం, బీసీ నాయకులు స్వామి కార్యం పేరుతో స్వకార్యం.. ఆస్తులు పెంచుకోవటం కారణాలు.
బీసీ నేతలూ ఆస్తులు ప్రకటించండి
రొక్కం లేకుండా మేము బొక్కం అనే బీసీ నాయకులూ మీ ఆస్తులు ప్రకటించండి. రాజ్యాధికారం పేరుతో చట్ట సభల్లో కూడా నాయకుల సంఖ్య పెరగటం లేదంటే.. ఇవి ఎవరికీ ప్రయోజనం లేని నిరర్ధక ఉద్యమాలుగానే చూస్తున్నారు. లెక్క కోసం అంజన్‌కుమార్, మధుయాష్కీలను పక్కన కూర్చోపెట్టుకుంటారు.34 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ 24 కూడా ఇవ్వటానికి మల్లగుల్లాలు పడుతుంది. బీసీ ఉద్యమ నాయకులు ప్రజల మీద అధార పడటం తప్పులేదు. అసంబద్ధంగా అసాధారణంగా..
బీసీ ఉద్యమ నాయకులు ఆర్థికంగా బాగుపడినంతగా ప్రజలకు ఏమీ ఒరగలేదు. అందుకే మీ ఆస్తులు ప్రకటించండి. పారదర్శకతను నిరూపించుకోండి. ఉత్పత్తి కులాలు కాయకష్టం చేసినా దశాబ్దాలుగా మారని బతుకులు కళ్ల ముందు కనబడుతుంటే, మెరుపు వేగంతో మీ ఆర్థిక అందలాలకు కారణాలు బీసీలకు చెప్పాలి. పాలకులు కోట్లు సంపాదించినా ఏమీ ఆనరు. అనేవాళ్ళు ఆ పార్టీలకు వెళ్ళండి. బీసీలను వాళ్ళ మానాన వాళ్లు వదిలేస్తే, పేదవాళ్ల పెదవి విరుపుతో వ్యక్తులు, వ్యవస్థలు పాలన పతనమైన చరిత్ర ఉంది.
బీసీ అంటే మాస్
బీసీ అంటే మాస్. ఈ మాస్ జనకోసం పనిచేసే నాయకులు జనంలో నుంచి సమస్య నుంచి పుట్టిన సగటు మనిషిలా ఉండాలి. కానీ ప్రదర్శన ప్రభావితమైన.. పాలక కులాల నాయకుడులా.. కారు, ఖద్ధర్.. క్యాష్.. గజ్జల దాకా బొజ్జ.. ఇస్త్రీ చెడని చొక్కా.. కండువా ఓ వేషగానిలా ఉంటే, ఉత్పత్తి కులాలు ఎలా అక్కున చేర్చుకుంటాయి? వాళ్ళ సంస్కృతిలో కలిసి పోవాలి. చెమట చిందించకుండా, చొక్కా నలగకుండా ఏ ఉద్యమం రాదు. ఎలాంటి ఐక్య ఉద్యమాలు లేని వ్యక్తి కేంద్రాలుగా బీసీ నాయకత్వం ఉన్నచోట, పాలకులు సంక్షేమం అభివృద్ధి పేరుతో బర్లు, గోర్లు.. కాకపోతే బంగారం ఇస్తారా? ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎందుకు ఇస్తారు? మణుం బంగారం కన్నా ఈసం ఎత్తు అధికారం మిన్న అనే చైతన్యం బీసీలకు వచ్చేదాకా.. ఇప్పుడున్న అవకాశాల కంటే తక్కువ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
దశాబ్ద కాలంలో శక్తి కేంద్రంగా మారాలి
మూడు ముక్కలాటగా బలహీనవర్గాల ఉద్యమాలు ఉన్నంత కాలం.. ప్రజల్లో కాకుండా పత్రికల్లో, పోస్టర్లలో ఉన్నానంత కాలం, బీసీలకు రాజకీయ అంటరానితనం ఉంటది. మనం బర్లు, గొర్లకే కాదు ఇంకా దిగజారినా ఆశ్చర్యం లేదు. మీడియాను నమ్మి ప్రచారం చేయొద్దు. మీడియా వాళ్ళు డబ్బులు అడిగితే, మా వార్త రాకుండా ఉండేందుకు 200 కవర్లో పెట్టి ఇవ్వండి. గ్రామం బేస్‌గా ఉద్యమాలు చేయండి. సంకకు సంచి వేసుకొని, గ్రామస్థులు పెట్టిన బువ్వ తిని రోజుకు 10 నుంచి 100 మందిని చైతన్యం చేసినా ఫరవాలేదు. వేలు.. లక్షలు సమీకరణ అనే భ్రమల్లో బతకొద్దు. కోట్లు పెట్టుబడి పెట్టి లాక్కో వటం అది పాలక కులాల లక్షణం.
నక్కను చూసి పిల్లి వాత పెట్టుకున్న చందమే అవుతుంది. గ్రామం యూనిట్ గా ఓ దశాబ్దం బీసీలను చైతన్యం చెయ్యకపోతే ఈ జాతి ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలిపోతారు. భ్రమించటమే తప్ప ఫలితం రాదు. దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమే. సాధనకు 65 ఏండ్లు పట్టింది. ఇప్పుడున్న తరహా ఉదమాల వల్ల బీసీలకు 135 ఏండ్లు అయినా రాజ్యాధికారం రాదు. బీసీ కులాల ఐక్యతతో బీసీ ఉద్యమాలు శక్తిగా మారాలి. కానీ వ్యక్తి కేంద్రంగా మారుతున్నాయి!
బీఎస్పీ 70 సీట్లు ఇస్తామంటున్నది కానీ..
తమ పార్టీ బలాన్ని పెంచుకోవటం కోసం అరకొర గా ఉన్న బీఎస్పీ లాంటి పార్టీ.. బీసీలకు 70 సీట్లు ఇస్తాం అంటున్నది. దాన్ని దేశవ్యాప్తంగా బీఎస్పీ దామాషా పాలసీ చెయ్యాలి. అక్కడ యూపీలో బీసీల నాయకత్వంలో ఉన్న సమాజ్‌వాదితో కలిసి పనిచేస్తే, సామాజిక శక్తుల పునరేకీకరణ జరిగేది. ప్రవీణ్ సార్‌కు కొంత ఉపయోగం అయ్యేది. యూపీలో మాయావతి సమాజ్‌వాదిని విస్మరించి.. బీజేపీకి అన్ని బిల్లులకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది. ప్రవీణ్ తెలంగాణాలో ఆర్. కృష్ణయ్య, మంద కృష్ణ, విశారదన్లను కలిసి ఐక్యంగా పనిచేద్దాం రండి అంటున్నారు మంచిదే. కానీ మీ విధానం యూపీలో ఎస్పీ బీసీలకు వ్యతిరేకం, ఇక్కడ అనుకూలం అంటే ఎవరు నమ్ముతారు ప్రవీణ్? వర్గీకరణను వ్యతిరేకించటమంటే, రాజ్యాంగాన్ని వ్యతిరేకించటమే అని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. అసమాన పంపిణీని సమర్థిస్తారా?