2028లో బీసీ వ్యక్తే తెలంగాణ సీఎం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

2028లో బీసీ వ్యక్తే తెలంగాణ సీఎం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి:
  • వరంగల్ ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో వక్తల పిలుపు
  • రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏండ్లు పట్టింది: తీన్మార్ మల్లన్న
  • ‘ఓట్లు మావే.. సీట్లు మావే’ నినాదంతో ముందుకెళ్లాలని సూచన
  • బీసీ ఉద్యమం అంటే.. అల్లాటప్పా కాదు: ఆర్.కృష్ణయ్య 
  • జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి: డీఎంకే ఎంపీ విల్సన్

వరంగల్‍/హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారో చెప్పడానికి 90 ఏండ్లు పట్టిందని వక్తలు అన్నారు. రిజర్వేషన్ల అమలుకు బీసీలు తెగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ‘ఓట్లు మావే.. సీట్లు మావే..’ అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలని సూచించారు. 2028లో బీసీ నేతనే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్‎లో ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో బీసీ నేతలు గళమెత్తారు. 

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 57% బీసీలు ఉన్నారని చెప్పేందుకు 90 ఏండ్లు పట్టింది. కులాల లెక్కలు చెప్తే సరిపోదు.. ఆ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి బీసీలకు సమాన వాటా కల్పించాలి. 2028 నుంచి ఇక రాష్ట్రానికి బీసీ సీఎం ఉంటడు. బీసీలు ఏడాదికి రూ.1.20 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాలో జమ చేస్తుంటే.. కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నరు. ఎమ్మెల్యేల్లో 60 మంది రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందినవాళ్లే ఉన్నరు. ఇక రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలి. అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలి. రాష్ట్రానికి జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక్కరే’’అని ఆయన అన్నారు. 

తమిళనాడులో 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్నరు: డీఎంకే ఎంపీ విల్సన్

దేశంలో 80% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించి, 2 నుంచి 3% ఉన్న ఓసీ వర్గాలకు 10% అమలు చేస్తున్నారని డీఎంకే పార్టీ ఎంపీ విల్సన్‍ అన్నారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉంటే.. బీసీలకు 50% కల్పించామని తెలిపారు. ‘‘సామాజిక, కుల గణన ఆధారంగా రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై ఢిల్లీలో అందరం కొట్లాడుదాం’’అని విల్సన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల్లో 43 మంది రెడ్డిలుంటే.. బీసీలు 19 మంది ఉన్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. 

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా బడుగు, బలహీన వర్గాలు వార్డు సభ్యుడిగా పోటీ చేయలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్‍ ఆఫీసర్‍ చిరంజీవులు, శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ, ప్రొఫెసర్‍ సూరజ్‍ మండల్‍, వకులాభరణం కృష్ణమోహన్‍ తదితరులు మాట్లాడారు. సభలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‍, బీసీ సంఘం నేతలు ప్రసన్న హరికృష్ణ, ఈగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

50 ఏండ్లుగా పోరాటం చేస్తున్నం: ఆర్.కృష్ణయ్య

బీసీ ఉద్యమం అంటే.. అల్లాటప్పా కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీల బతుకులు మార్చే మహా ఉద్యమమని తెలిపారు. ‘‘జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం. 50 ఏండ్లుగా బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. జగన్నాథ రావు, హన్మంత రావు సీఎం అయ్యే అవకాశాలు న్నప్పటికీ.. తొక్కేశారు. బీసీలంతా తమ పోరాట పంథా మార్చుకోవాలి. తెలంగాణ కోసం కొట్లాడినట్లే.. రిజర్వేషన్ల కోసం పోరాడాలి. కులాల పేర్ల మీదనే పార్టీలు, రాజకీయాలు నడుస్తున్నయ్. బీసీలంతా ఒక్కటే కులంగా కదలాలి’’అని ఆయన పిలుపునిచ్చారు.