మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై HRCకి ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వదిలేసి మునుగోడు నియోజకవర్గంలో తిష్ట వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు.. తమ నియోజకవర్గాల్లో సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవుల్లో కొనసాగే అర్హత లేదని, వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని కోరారు. ఇదే విషయంపై రేపు గవర్నర్ తమిళి సైను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది.