- యూబీ గ్రూప్ కంపెనీ రాష్ట్రంలో బీర్ల కృత్రిమ కొరత సృష్టిస్తోంది
- బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్
బషీర్ బాగ్, వెలుగు: కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. యూబీ గ్రూప్కంపెనీ మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ల కృత్రిమ సృష్టిస్తోందని ఆరోపించారు. శనివారం ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. యూబీ గ్రూప్కంపెనీకి గత బీఆర్ఎస్ప్రభుత్వం పూర్తిగా సహకరించిందన్నారు. చివరికి అదే కంపెనీ ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి చేరిందని అసహనం వ్యక్తం చేశారు.
ఎక్కువ ఖర్చు లేకుండా తయారయ్యే బీరుకు 18 శాతం కమీషన్ సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ చేసి.. ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. అంతకంటే తక్కువ ధరకు.. నాణ్యమైన బీర్లు సరఫరా చేసే కంపెనీలు చాలా ఉన్నాయన్నారు. యూబీ గ్రూప్ ఆధిపత్యంతో ఇతర కంపెనీలు తెలంగాణలో బీర్ల అమ్మకాలు చేయలేకపోతున్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు కింగ్ ఫిషర్ బీర్లను బ్యాన్ చేయాలని యుగంధర్గౌడ్విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రాయితీలపై నడిచే కంపెనీలు ప్రభుత్వాలనే బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని కోరారు.