- ఓఆర్ఆర్ రోడ్డు టోల్ లీజ్లో అవకతవకలు జరిగాయని బీసీ పొలిటికల్ జేఏసీ ఆరోపణ
బషీర్ బాగ్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఫిర్యాదు చేశారు. లోపాయికారి ఒప్పందాలతో వారిద్దరూ ప్రజాధనం లూటీ చేశారని, వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ ను కలిసి కేసీఆర్, కేటీఆర్ పై ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజును ఐఆర్బీ సంస్థకు ఇవ్వడంలో.. వరంగల్, రంగారెడ్డి కైటెక్స్ యూనిట్ల స్థాపనలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు టెండర్ లేదా లీజు అగ్రిమెంట్ అయిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చాయని, ఆ వెంటనే బీఆర్ఎస్ ఆ బాండ్లను ఎన్ క్యాష్మెంటు చేసుకుందని ఆరోపించారు. అప్పటి పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ కు ఈ క్విడ్ ప్రోకో తతంగంతో నేరుగా ఒప్పందం ఉందన్నారు.
క్విడ్ ప్రోకో చేయడం వల్లనే జాతీయ పార్టీ బీజేపీ తర్వాత అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకే వచ్చాయన్నారు. గతంలో జరిగిన ఒప్పందాలు, కాంట్రాక్టులు, లీజులపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు గోల్ మాల్ చేసిన కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేసి విచారిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు.