ప్రపంచంలోని ప్రతీ దేశంలో సమర్ధమైన నాయకత్వం, అనుభవం ప్రామాణికంగా ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, క్రీడా, రాజకీయ రంగాలలో యువత రాణించగలుగుతుండగా మన దేశంలో మాత్రం కులం అనే మహమ్మారి సమర్థుల అవకాశాలకు అడ్డంగా నిలుస్తుంది. ఈ దేశంలో పుట్టి భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ రాజ్యాన్ని ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్న రిషి సునాక్, అగ్ర దేశమైన అమెరికాకు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ కమలా హారిస్ వంటి వారు అవకాశాలను చేపట్టడానికి అక్కడి రాజ్యాంగ రాజకీయ వాతావరణ పరిస్థితులు దోహదపడుతున్నాయి. మనదేశంలో అంతర్లీనంగా ఉన్న అట్టడుగు బలహీన వర్గాల శక్తియుక్తులను భారతదేశం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం వల్లనే జనాభా రీత్యా మనం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నా సమర్ధమైన నాయకత్వం ,దేశ పురోభివృద్ధి విషయంలో నేటికీ వెంపర్లాడుతూనే ఉన్నాము.
బీసీల ఆశాజ్యోతి మోడీ
అట్టడుగు, అణగారిన, పీడిత, బలహీన వర్గాలు బాగుపడాలంటే ఈ వర్గాల సమస్యలు పరిపూర్ణంగా తెలిసి నిబద్ధతతో పనిచేసే నాయకత్వం ముందుకు వచ్చినప్పుడే ఈ వర్గాలు బాగుపడి దేశంలో సమానత్వం సాధ్యపడుతుంది. కానీ అగ్రవర్ణాలతో రాజకీయంగా పోటీపడే పరిస్థితిలో బీసీలు లేకపోవడం, భూములు ఆస్తులు అగ్రవర్ణాల చేతుల్లో కేంద్రీకృతం అయినందువల్ల, దేశంలో పలు రాజకీయ పార్టీలు ఎన్నికలను ఖరీదైన ప్రక్రియగా మార్చడం వల్ల బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడానికి అవసరమైన అసెంబ్లీ, పార్లమెంటులలో ఎన్నిక కాబడటంలో బీసీ నాయకులు సఫలీకృతం కాలేకపోతున్నారు. ఈ దేశంలో అనాదిగా అధికారాన్ని, అవకాశాలను చేజిక్కించుకున్న కొన్ని కులాలు మాత్రమే చెలాయించాయి. ఈ తరుణంలో ఒక బీసీ ప్రధానిగా మోదీ ఎన్నిక కావడం, తద్వారా ఈ దేశ ముఖచిత్రాన్ని మార్చగలరన్న ఆశ, నమ్మకం ఈ దేశ మెజార్టీ వర్గాలైన బీసీల్లో మొదలైంది.
రెండు రాజ్యాంగ సవరణలు చాలు
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని కారణంగా అసెంబ్లీ పార్లమెంటులో బీసీలు అడుగు పెట్ట లేకపోతున్న విషయం ప్రధాని మోదీకి తెలుసు. అందుకు అవసరమైన ఒక చిన్న రాజ్యాంగ సవరణను పార్లమెంటు సాక్షిగా తన తొమ్మిదేళ్ల పరిపాలనలో తేలేకపోయారు. 2021 దేశ జనగణనలో బీసీల కులగణన నిర్వహించాలి. కానీ ప్రధాని మోదీ ఈ అంశాన్ని బీసీల పక్షాన నెరవేర్చడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తున్నది. అయితే ప్రధాని మోదీ బీసీ అయి ఉండి అగ్రవర్ణాలకు రాత్రికి రాత్రి
హుటాహుటిన103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు తీసుకురాగలిగినప్పుడు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు అవసరమైన రెండు రాజ్యాంగ సవరణలతో కూడిన బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేయలేరా?
బీసీల తలరాత మార్చే శక్తి మోదీకి ఉంది
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటు సాక్షిగా చేపట్టిన 73,74వ రాజ్యాంగ సవరణలను అనుసరించి అసెంబ్లీ, పార్లమెంట్ లో కూడా రెండు రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా చట్టసభల్లో బీసీ లకు రేజర్వేషన్లు కల్పించి ఒక అద్భుతమైన ప్రక్రియకు మోదీ ఆద్యుడుగా మిగిలే అవకాశముంది. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదాను తీసుకువచ్చి తన మంత్రివర్గంలో 27 మంది బీసీలకు 12 మంది ఎస్సీలకు 8 మంది ఎస్టీలకు ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించి సామాజిక సమతుల్యతను ప్రతిబింబించిన మోదీ నాయకత్వం అభినందనీయం. బీసీల తలరాతను మార్చే అత్యంత శక్తివంతమైన బీసీ బిల్లును చట్టసభల్లో అవసరమైన రెండు చిన్న రాజ్యాంగ సవరణలు చేపడితే మోడీ చరిత్రలో నిలిచిపోతారు. తెలుగు రాష్ట్రాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి వస్తున్న ప్రధాని మోదీ ఇక్కడ నేటికీ ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదని గమనిస్తారని ఆశిద్దాం. ఈ ప్రాంత బీసీల అభీష్టాన్ని నెరవేర్చాలని కోరుకుందాం!
- దాసు సురేశ్ అధ్యక్షుడు, బీసీ రాజ్యాధికార సమితి