టికెట్ కోసం ఏకతాటిపైకి బీసీ లీడర్లు

  • టికెట్ కోసం ఏకతాటిపైకి బీసీ లీడర్లు
  • సిట్టింగులకు అసమ్మతి ఎఫెక్ట్​ 
  • గద్వాలలో   స్ట్రాంగ్​గా కనిపిస్తున్న బీజేపీ 
  • అలంపూర్​లో బీఆర్ఎస్​ నుంచి ఆశావహులు ఎక్కువే..

గద్వాల, వెలుగు: నడిగడ్డ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసం గ్రూపులుగా విడిపోయిన లీడర్లు అసమ్మతి కుంపట్లు రాజేస్తున్నారు. ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్​ బీసీ పాలిటిక్స్​ హీటెక్కిస్తున్నాయి. ఈసారి టికెట్​తమకే ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్న బీసీ లీడర్లు ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫొటో లేకుండా వాల్ పోస్టర్లు వేయడం ఆ పార్టీలో హాట్​టాపిక్ గా మారింది. అలంపూర్ సెగ్మెంట్​లోనూ బీఆర్ఎస్ కారు  లీడర్లతో ఓవర్ లోడ్ అయింది. ఇక్కడ సిట్టింగ్​ఎమ్మెల్యే అబ్రహంకు ఫిట్టింగులు పెడ్తున్న వాళ్ల చిట్టా చాంతాడంత ఉంది. కాగా, సీనియర్ కాంగ్రెస్ లీడర్ డీకే అరుణ బీజేపీలో చేరడంతో గద్వాల నియోజకవర్గంలో ఆ పార్టీ బలం పుంజుకుంది. అటు ఆలంపూర్​లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నుంచి రూలింగ్​పార్టీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక సర్కారు హామీ ఇచ్చిన గట్టు, నెట్టెంపాడు లిఫ్టులు, ఆర్డీఎస్​ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడం, తుమ్మిళ్ల కింద రిజర్వాయర్లు ఆగిపోవడం, అర్హులకు డబుల్​బెడ్​రూం ఇండ్లు, దళితబంధు లాంటి స్కీంలు అందకపోవడం బీఆర్ఎస్​కు మైనస్​గా మారనుంది.

గద్వాల బీఆర్ఎస్​లో బీసీ పాలిటిక్స్​

గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో బీ టీం, బీసీ లీడర్ల పాలిటిక్స్ నడుస్తున్నాయి. జడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగినప్పటి నుంచి చైర్మన్, ఎమ్మెల్యేకు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం బీసీలు అయిన జడ్పీ చైర్​పర్సన్​ సరిత, క్రీడా చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, గట్టు జడ్పీటీసీ శ్యామల భర్త బాసు హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్​బండారి భాస్కర్ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే ఇతర పార్టీ నుంచైనా టికెట్ తెచ్చుకుని పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీజేపీలోని కిందిస్థాయి లీడర్లలో కొంత గ్రూపు తగాదాలున్నా వాటిని డీకే అరుణ ఎప్పటికప్పుడు క్లియర్ ​చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ కు సరైన లీడర్ లేడు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తున్నారు.  

అలంపూర్​లో చల్ల చెప్పినోళ్లకే టికెట్​?  

అలంపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ టికెట్ ఆశించే వారి సంఖ్య భారీగానే ఉన్నది. మాజీ ఎంపీ మంద జగన్నాథం కొడుకు మంద శ్రీనాథ్, యూత్ బీఆర్ఎస్​ లీడర్ కిశోర్ కుమార్,  గిడ్డంగుల సంస్థ చైర్మన్ సింగర్ సాయిచంద్, మాజీ జడ్పీ చైర్మన్ ​బండారి భాస్కర్  టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చల్ల వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ఆయన సూచించిన వ్యక్తికే టికెట్ వస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్నది. టికెట్ కమిట్​మెంట్​వచ్చాకే పార్టీలో చేరారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ చల్ల వెళ్లిపోవడంతో కేడర్​కూడా ఆయనతోనే బీఆర్​ఎస్​లో చేరింది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీలో టికెట్ ఆశించేవారు పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ అంతంత మాత్రంగానే ఉన్నది. ఎస్సీ రిజర్వ్ కావడంతో బీజేపీలోని బంగి లక్ష్మణ్, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బంగారు శ్రుతి టికెట్ ఆశిస్తున్నారు.

ప్రధాన హామీలు నెరవేర్చలే

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేదు. గద్వాల నియోజకవర్గానికి గట్టు లిఫ్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి వాటి పనులను ఇప్పుడే మొదలుపెట్టారు. రెండు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదు. నెట్టెంపాడు లిఫ్ట్ పనులు పూర్తి చేయలేదు. జూరాల దగ్గర బృందావన్ కట్టలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రూ.ఐదు కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేసినా  నత్తనడకన సాగుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో మినీ బస్టాండ్ నిర్మించలేదు. ఆర్డీఎస్ ఆధునికరణ చేయలేదు. తుమ్మిళ్ల లిఫ్టులో వల్లూరు, జూలకల్లు, మల్లమ్మ కుంటల రిజర్వాయర్లు నిర్మిస్తామన్నా ఆ ఊసే లేదు. ప్రసాద్ స్కీం పనులను నిర్లక్ష్యం  చేస్తున్నారు.