
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తిన వేదికగా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై గర్జించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన బీసీ పోరు గర్జనలో మాట్లాడిన సీఎం.. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే.. ఎందుకు ఆమోదించటం లేదని.. ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని నేరుగానే ప్రశ్నించారు. బీసీ ప్రధానిగా చెప్పుకునే మోడీకి.. బీసీల ఆత్మ గౌరవం కనిపించటం లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ గర్జన మొదలైందని.. ఇది ధర్మ యుద్ధం అని.. ఇక నుంచి మేం ఢిల్లీకి వచ్చేది లేదని.. మోడీనే తెలంగాణ గల్లీ గల్లీకి రప్పిస్తాం అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లో బలం లేకపోయినా.. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు.. ఆర్టికల్ 370 బిల్లు తీసుకొచ్చారు.. ఇప్పుడు వక్ఫ్ బిల్లు తీసుకొస్తున్నారు.. ఈ బిల్లులన్నింటికీ బీజేపీకి బలం లేకపోయినా తీసుకొచ్చారని.. అలాంటిది తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ పోరు గర్జనకు దేశంలోని 16 పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని.. కాంగ్రెస్ వంద మందికి పైగా ఎంపీల మద్దతు ఇస్తున్నా.. పార్లమెంట్ లో ఎందుకు ఆమోదించటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు.. మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. ఇది దేశ వ్యాప్తంగా ఉద్యమంగా రాజుకుంటుందని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని తండ్రీ, కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టి.. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని.. బీసీ బిల్లుకు అనుమతి ఇవ్వకపోతే ఢిల్లీ నుంచి మిమ్మల్ని తెలంగాణ గల్లీలకు రప్పిస్తాం అంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా.. తెలంగాణ సమాజం నుంచి.. బడుగు బలహీన వర్గాల నుంచి మీకు విజ్ణప్తి చేస్తు్న్నాం.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన బిల్లుకు అనుమతి ఇవ్వండి లేదంటూ రాబోయే రోజుల్లో బీజేపీకి గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.