ముషీరాబాద్, వెలుగు: బీసీ మహిళ అయిన కొండా సురేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అసభ్యకరంగా ట్రోల్ చేయడం దారుణమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మండిపడ్డారు. బీసీ మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇదే పరిస్థితి తన సోదరికి ఎదురైతే కేటీఆర్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. సిరిసిల్లలో చేనేతల ఓట్లతో గద్దెనెక్కిన కేటీఆర్.. ఆ వర్గపు మహిళను అవమానించడం దురదృష్టకరమన్నారు.
మంత్రి కొండా సురేఖకు జరిగిన అవమానం తెలంగాణలోని మహిళలకు, చేనేత వర్గానికి, బీసీ వర్గానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని తెలిపారు.ఈ ఇష్యూ పై వెంటనే కేటీఆర్ మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల పరంగా ఏదైనా అంశాలు ఉంటే విమర్శించుకోవాలి కానీ ఇలా వ్యక్తిగతంగా మంత్రిగా ఉన్న ఒక బీసీ మహిళపైన సోషల్ మీడియా ద్వారా దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు.