- ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు: సీఎం రేవంత్
- బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం
- ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలొస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం
- మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడి!
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతానికి తగ్గకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఒకవేళ కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు సిఫార్సు చేస్తే.. ఆ మేరకు ఇచ్చేద్దాం” అని శనివారం మంత్రులతో సమావేశంలో సీఎం అన్నట్టు తెలిసింది. ‘ఎంత జనాభాకు అంతా వాటా’ అనే నినాదంతో రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారని.. ఈ నేపథ్యంలో దాన్ని రాష్ట్రం నుంచే మొదలుపెట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.
‘‘ఇప్పటికే కులగణన నివేదిక పూర్తయింది. బీసీ డెడికేటెడ్ కమిషన్కూడా బీసీ రిజర్వేషన్లపై రిపోర్ట్ రెడీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో మనం హామీ ఇచ్చాం. వార్డులు, పంచాయతీల వారీగా బీసీ రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్కమిషన్ సిఫార్సులు చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దాం’’ అని మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టు తెలిసింది. అయితే బీసీ రిజర్వేషన్లు 42 శాతం గానీ, బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినంత గానీ అమలు చేస్తే.. న్యాయపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అనే దానిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
‘‘ఒకవేళ బీసీలకు ప్రభుత్వ పరంగా స్థానిక సంస్థల్లో గానీ, విద్య, ఉద్యోగాల పరంగా గానీ రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ముందు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేద్దాం. ఒకవేళ ఎలాంటి ఇబ్బంది లేకపోతే యథావిధిగా ముందుకు వెళ్దాం. ఏమైనా సమస్యలు వస్తే బీసీ డెడికేటెడ్కమిషన్ఎక్కడెక్కడా బీసీ రిజర్వేషన్లకు సిఫార్సులు చేస్తుందో.. ఆయా వార్డులు, పంచాయతీల వారీగా పార్టీ పరంగా బీసీ అభ్యర్థులను నిలబెడదాం. ఇదే పార్టీ నిర్ణయం. రాహుల్‌గాంధీ ఆలోచన అని కూడా ఇదే” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. కింది స్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడర్‌లోకి ఈ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు ఆయన సూచించారు. అవసరమైతే దీనిపై అసెంబ్లీలో ప్రకటన కూడా చేద్దామని సీఎం పేర్కొన్నట్టు ఓ మంత్రి తెలిపారు.
మనం ఇస్తే.. వాళ్లూ ఇవ్వాల్సిందే..
బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే... మిగతా పార్టీలు కూడా కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టు తెలిసింది. ఇతర పార్టీలు కూడా బీసీ నినాదం ఎత్తుకుంటాయని, కాంగ్రెస్ఇచ్చినట్టే బీసీలకు సీట్లు కేటాయిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే దేశంలోనే మొదటిసారి బీసీలకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చి, అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే దక్కాలని.. ఆ దిశగా ప్రచారం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వం తరపున రిజర్వేషన్లు అమలు చేస్తే వచ్చే న్యాయపరమైన చిక్కులకు సంబంధించి ప్రత్యేక లీగల్‌టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లు 50 శాతం క్యాప్ దాటడంపై ఏజీ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు.