బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎట్లా

బీసీలకు 42 శాతం  రిజర్వేషన్లు ఎట్లా
  • కామారెడ్డి డిక్లరేషన్​ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్న కాంగ్రెస్​
  • ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్​.. మిగిలిన పార్టీలూ ఇవ్వాలని సవాల్​
  • ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు..
  • ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ
  • నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్​ భేటీ.. స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: లోకల్​బాడీ ఎలక్షన్స్​లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే దానిపై అన్ని పార్టీల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. రిజర్వేషన్లు  ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటరాదని గతంలో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు, రిజర్వేషన్లు పెంచుతూ బిహార్​, రాజస్థాన్​లాంటి  రాష్ట్రాలు చేసిన చట్టాలనూ  రద్దు చేసింది. ఈ  నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్​లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్​రెడ్డి పట్టుదలతో ఉన్నారు. చట్ట పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే  పార్టీ తరఫున 42 శాతం సీట్లు ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఇక బీసీ డెడికేటెడ్​కమిషన్  సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్లు ఎలాగూ చట్టబద్ధంగానే వస్తాయని, మిగిలిన 20 శాతం సీట్లను పార్టీపరంగా కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాల్లో చర్చ నడుస్తున్నది.  ఒకవేళ కాంగ్రెస్.. పార్టీ పరంగా 42 శాతం సీట్లను బీసీలకు దక్కేలా చేస్తే మిగిలిన పార్టీలు కూడా ఆ మేరకు వెనుకబడిన వర్గాలకు సీట్లు ఇవ్వక తప్పదనే అభిప్రాయం 
వ్యక్తమవుతున్నది. 

కాంగ్రెస్​ ఇస్తే మిగిలిన పార్టీలపై ప్రెజర్​..

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని, ఇతర పార్టీలకు 42 శాతం ఇచ్చే దమ్ము ఉందా? అని అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి సవాల్ విసిరారు. సుప్రీం తీర్పు, వివిధ రాష్ట్రాల అనుభవాల నేపథ్యంలో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు  కష్టమనే అభిప్రాయానికి సీఎం వచ్చినందునే ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తున్నది. డెడికేటెడ్​ కమిషన్​సిఫార్సుల ప్రకారం పంచాయతీలు, పరిషత్​లలో  ఎస్సీ, ఎస్టీలకు 27 నుంచి 28 శాతం రిజర్వేషన్లు పోగా, బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్లు ఎలాగూ అధికారికంగా అమలు చేయవచ్చు. ఇవిపోగా మిగిలిన 50 శాతం స్థానాల్లో 20 శాతం టికెట్లను పార్టీపరంగా బీసీలకు కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్​ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అంటే సర్పంచ్​ అభ్యర్థులకు అధికారికంగా పార్టీ టికెట్ల కేటాయింపు ఉండదు. 

కానీ అనధికారికంగానైనా రిజర్వేషన్లు పోగా.. మిగిలిన గ్రామాల్లో పార్టీ తరఫున 22 శాతం మంది బీసీ అభ్యర్థులను నిలపాలని కాంగ్రెస్​ భావిస్తున్నది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో డెడికేటెడ్​కమిషన్​సిఫారసుల​ ప్రకారం 22 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలుచేస్తూనే  మిగిలిన 20 శాతం స్థానాల్లో  బీసీలకు టికెట్లు ఇవ్వడంతోపాటు  ఎంపీపీలు, జడ్పీ చైర్​పర్సన్ల ఎంపికలోనూ ఈ దామాషా పాటించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఇప్పటికే పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​కు సీఎం రేవంత్​ సంకేతాలు ఇవ్వడంతో.. గ్రామాలవారీగా ఆశావహుల లిస్ట్​ రెడీ చేస్తున్నారు. డెడికేటెడ్​ కమిషన్​ఇచ్చిన రిపోర్ట్​ఆధారంగా బీసీలు ఎక్కువగా ఉన్న స్థానాల్లోనూ ఆ పార్టీ నుంచి బీసీ క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వాలని దాదాపు నిర్ణయించారు.  కాగా, కాంగ్రెస్ రిజర్వేషన్లతో కలిపి బీసీలకు 42 శాతం స్థానాలు కేటాయిస్తే తమ పార్టీల్లోనూ ఆ డిమాండ్లు వచ్చే అవకాశముందని  బీఆర్ఎస్​, బీజేపీ భావిస్తున్నాయి. 

ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలని బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతున్నది. బీసీలకు 42శాతం సీట్లను చట్టబద్ధంగా ఇవ్వాలనే తాము డిమాండ్​చేస్తున్నామని, ఒకవేళ అలా కుదరకుంటే తాము కూడా కాంగ్రెస్​తో సమానంగా 42 శాతం కేటాయిస్తామని కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. గతంలోనే బీసీలకు 50 శాతం కేటాయించిన చరిత్ర తమ పార్టీకి ఉందని, అవసరమైతే  50 శాతం కూడా కేటాయిస్తామని చెప్పినట్టు తెలిసింది.  కాగా, బీజేపీ మాత్రం పార్టీపరంగా బీసీలకు 42 శాతం స్థానాల కేటాయింపుపై మౌనంగా ఉంది. ఇటీవల భర్తీ చేసిన పార్టీ మండల అధ్యక్ష పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించామని చెప్తున్నా..  స్థానిక ఎన్నికలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ 42 శాతం కేటాయిస్తే తాము కూడా కేటాయించక తప్పదని ఆ పార్టీ నేత ఒకరు  ‘వెలుగు’తో చెప్పారు. 

 డెడికేటెడ్​ కమిషన్​ నివేదిక తప్పనిసరి 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు డెడికేటెడ్​ కమిషన్​ కచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2021లోనే స్పష్టం చేసింది. అందులో భాగంగానే కాంగ్రెస్​ సర్కారు రాష్ట్రంలో కమిషన్ ను​ ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 2011  జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నప్పటికీ బీసీల గణాంకాలేవీ లేవు. 

దీంతో ప్రభుత్వం ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​ ద్వారా కుల గణన చేపట్టి, కులాలవారీ జనాభా వివరాలను డెడికేటెడ్​ కమిషన్​కు అందజేసింది. అంతకుముందే కమిషన్ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి, వివిధ వర్గాలతో భేటీ అయ్యింది.  2011 జనాభా లెక్కలతోనూ కుస్తీ పట్టింది. అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశాక ఇటీవల నివేదికను  ప్రభుత్వానికి అందజేసింది.  దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 27 నుంచి 28 శాతం స్థానాలు పోగా, కేవలం 22 శాతం మాత్రమే బీసీలకు కేటాయించాలని డెడికేటెడ్​ కమిషన్​ సిఫార్సు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి ఈ కుల గణన ప్రకారమే రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్టు తేలింది.  

నేడు ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్​

బీసీ డెడికేటెడ్​ కమిషన్​ రిపోర్ట్ అందిన నేపథ్యంలో కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో  సీఎం రేవంత్​రెడ్డి బుధవారం ఉదయం 11.30 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.  ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం రిజర్వేషన్లతోపాటు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను  ఏయే విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఖరారు.. 

కమిషన్ దాదాపు 3 నెలలపాటు కసరత్తు చేసి.. బీసీ రిజర్వేషన్లపై 700 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఏ గ్రామంలో ఎంత మంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్టు తెలిసింది. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏయే వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్టు సమాచారం. మండలాల యూనిట్​గా సర్పంచ్​, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్​గా జడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్​గా జడ్పీ చైర్​పర్సన్​ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లాస్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి, పంచాయతీరాజ్​ డిపార్ట్​మెంట్​కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజిట్ విడుదల చేస్తుంది. 

అనంతరం ఈ నివేదికను ఎలక్షన్ కమిషన్​కు అందజేస్తే దాని ఆధారంగా ఈసీ అధికారులు  ఎన్నికల షెడ్యూల్ ను​ విడుదలచేస్తారు.  రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, 70 మండలాలు ఉన్నాయి. 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కాగా,  రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ గ్రామాల్లో 100 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకే  కేటాయిస్తారు. నాన్ ఏజెన్సీ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుకు అక్కడ ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీల జనాభాను ప్రాతిపదికన తీసుకోనున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.  ప్రస్తుతం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లను డెడికెటేడ్ కమిషన్ సిఫారసు చేసినట్టు తెలిసింది. జిల్లాలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేటప్పుడు ఇందులో కొంత మార్పులు చేర్పులు జరగవచ్చు. కాగా, 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయగా, బీసీలకు పంచాయతీల్లో  22.78 శాతం,  మండల పరిషత్​లలో  18.77 శాతం, జిల్లా పరిషత్​లలో 17.11 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఈసారి కూడా ఇంచుమించు ఈస్థాయిలోనే సీట్లు దక్కనుండగా, పార్టీ పరంగా కేటాయించే సీట్లు అదనం కానున్నాయి.