తెరపైకి బీసీ నినాదం!.. భువనగిరి పార్లమెంట్‌‌‌‌ సీటు బూరకు ఇచ్చిన బీజేపీ

  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌లోనూ మొదలైన ఒత్తిళ్లు 
  • నల్గొండ, భువనగిరి సీట్లలో ఒకటి ఇవ్వాలంటున్న బీసీ నేతలు 
  • మొన్నటి వరకు రెండు రెడ్లకే ఇస్తారని ప్రచారం

నల్గొండ, వెలుగు : పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల నేపథ్యంలో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. బీజేపీ భువనగిరి బీసీ క్యాండిడేట్‌‌‌‌గా మాజీ ఎంపీ డాక్టర్​ బూర నర్సయ్యగౌడ్‌‌‌‌ను ప్రకటించడంతో కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోనూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. నల్గొండ, భువనగరి సీట్లలో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని ఈ పార్టీల్లోని బీసీ వర్గం నేతలు కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌‌‌‌కు రెండు సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టింది. 

దీంతో ఎంపీ ఎన్నికల్లో అయినా కచ్చితంగా ఒక సీటు ఇవ్వాలని పార్టీకి రిక్వెస్టులు పెడుతున్నారు.  బీఆర్ఎస్​పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌‌‌‌కు ఇద్దరు బీసీలకు ఛాన్స్​ఇచ్చినా ఫలితం దక్కలేదు.  భువనగిరి ఎంపీ సీటును గత రెండు పర్యాయాలు బీసీ నేతకే ఇచ్చింది.  ఈ సారి కూడా కూడా అదేసీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నా.. ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
 
భువనగిరిపైనే గురి

 

బీజేపీ భువనగిరి సీటు బీసీలకు డిక్లేర్​ చేయడంతో కాంగ్రెస్‌‌‌‌లోనూ ఇదే ఫార్ములాను అమలు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు పార్టీ జాబితాలో ఇప్పటికే సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్​ పేరు చేర్చగా.. తాజాగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యాసాగర్​ పేరు తెరపైకి వచ్చింది.  మూడు సార్లు ఎమ్మెల్సీగా, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుధీర్ఘకాలం పాటం పనిచేసిన విద్యాసాగర్​ సొంత నియోజకర్గమైన నకిరేకల్​ భువనగిరి పార్లమెంట్‌‌‌‌ పరిధిలోకి వస్తుంది. 

పైగా పాత రామన్నపేట, నకిరేకల్​, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో రాజకీయంగా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఇదే సీటు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్న కొడుకు డాక్టర్​సూర్యపవన్​ రెడ్డి, చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మ న్​ కసిరెడ్డి నారాయా రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.  నల్గొండ నుంచి పోటీ చేస్తానని జానారెడ్డి  ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తప్పుకుంటే కొడుకు రఘువీర్​ రెడ్డి, పటేల్​ రమేశ్ రెడ్డిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.  దీంతో బీసీ లీడర్లు ఫోకస్‌‌‌‌ అంతా భువనగిరిపై పెట్టారు. 

ఆచీతూచీ అడుగులు వేస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఆచీతూచీ అడుగులు వేస్తోంది.  2014 ఎంపీ ఎన్నికల్లో రెడ్డి క్యాండిడేట్‌‌‌‌కు వ్యతిరేకంగా బీసీని నిలబెట్టి విజయం సాధించిన బీఆర్ఎస్​, నల్గొండలో మాత్రం రెండు సార్లు ఓటమి పాలైంది. 2019లో భువనగిరిలో సిట్టింగ్​సీటు కోల్పోయింది. ఈ సారి మాత్రం గెలుపు గుర్రాలను నిలబెట్టాలని భావిస్తోంది. అవసరమైతే రెండు సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. 

కానీ, కాంగ్రెస్​, బీజేపీ ఫార్మాలనే బీఆర్ఎస్​ కూడా అమలు చేస్తదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. అదే జరిగితే బీసీ కోటాలో భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్​, పొన్నాల లక్ష్మయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బూడిద భిక్షమయ్యగౌడ్​ఎమ్మెల్సీ, కార్పొరేషన్​ చైర్మన్​ చేస్తామన్న హామీని పార్టీ నెరవేర్చలేకపోయింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు భువనగిరి ఎంపీ టికెట్​ ఆయనకే అని ప్రచారం జరిగింది. 

నల్గొండ ఎంపీ టికెట్​ కోసం సీనియర్​ నేత సుంకరి మల్లేశం గౌడ్​, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ డాక్టర్​ మాతృ నాయక్​ పేర్లు వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి రెండు చోట్ల మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, గుత్తా అమిత్​ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.  

బీజేపీలో సీనియర్లు నారాజ్​ 

కాంగ్రెస్​, బీఆర్ఎస్‌‌‌‌లో బీసీ నినాదం గురించి చర్చ జరుగుతుంటే బీజేపీలో మాత్రం సీనియర్లు నారాజ్​అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకు ఎంపీ టికెట్లు ఇవ్వడంతో అలకబూనినట్లు తెలిసింది.  కాగా, భువనగిరి టికెట్ ఆశించిన గంగడి మనోహర్​రెడ్డితో పాటు నూకల నర్సింహారెడ్డి, గోలి మధుసూధన్​రెడ్డి నల్గొండ రేసులో ఉన్నాయి. వీరితో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నల్గొండ పార్లమెంట్​కన్వీనర్  బండారు ప్రసాద్​ టికెట్​కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.