ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం.. మూడు చోట్ల బరిలోకి దిగుతున్న బీసీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం.. మూడు చోట్ల బరిలోకి దిగుతున్న బీసీ అభ్యర్థులు
  • ప్రధాన పార్టీలు, సంఘాల తీరుపై బీసీ నేతల ఆగ్రహం
  • లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌‌‌‌ లక్ష్యంగా పోరాటం
  • ఫిబ్రవరి 2న లక్ష మందితో వరంగల్‌లో బీసీ రాజకీయ యుద్ధ భేరి

వరంగల్‍, వెలుగు : వచ్చే నెల 27న రాష్ట్రంలో రెండు టీచర్‍, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పైకి బీసీ జపం చేస్తూనే.. బీసీ నేతలకు మద్దతు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయన్న భావన ఆ వర్గం నేతల్లో నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు లోకల్‌ బాడీస్‌ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలుచేయాలంటూ వచ్చే నెల 2న ‘బీసీ యుద్ధభేరి’ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.

మెజార్టీ స్థానాల్లో ఓసీలకే మద్దతు

రాష్ట్రంలో కరీంనగర్‍, మెదక్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎన్నికలతో పాటు వరంగల్‍, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍, మెదక్‍ జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చింది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు టీచర్స్‌ సంఘాలు సైతం ఓసీ నేతలకు మద్దతు ఇవ్వడంపై బీసీ లీడర్లు అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీ తరఫున.. మెదక్‌, కరీంనగర్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ క్యాండిడేట్‌గా అంజిరెడ్డి, వరంగల్‍, నల్గొండ, ఖమ్మం టీచర్స్‌ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ ప్రకటించింది. అలాగే కాంగ్రెస్‌ తరఫున కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి లేదంటే ముస్కు రమణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్‌ టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పీఆర్‍టీయూ నుంచి పింగిళి శ్రీపాల్‍రెడ్డి పేరును ప్రకటించగా.. ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రాజకీయ పార్టీలు, టీచర్‍ యూనియన్ల నుంచి ఓసీ అభ్యర్థులే ఎక్కువగా కనిపిస్తున్నారు.. 

అసంతృప్తిలో బీసీ లీడర్లు

అన్ని పార్టీలు ఓసీ క్యాండిడేట్లకే మద్దతు ప్రకటించడం పట్ల బీసీ సంఘాల లీడర్లు మండిపడుతున్నారు. రాజకీయ పార్టీలు, యూనియన్లు తమకు అవకాశం ఇవ్వాలని ఓ వైపు కోరుతూనే.. మరోవైపు ఎమ్మెల్సీ బరిలో ఉండేందుకు బీసీలు సిద్ధమయ్యారు. కరీంనగర్‍, మెదక్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‌ జిల్లాల టీచర్‍ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బీసీ నేతగా మల్క కొమురయ్య పోటీలో ఉన్నారు. కరీంనగర్‍ గ్రాడ్యుయేట్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‍ కోసం ప్రసన్న హరికృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా డాక్టర్‌ రాజ్‍కుమార్‌ బరిలో ఉంటున్నారు. వరంగల్‍, నల్గొండ, ఖమ్మం టీచర్స్‌ స్థానం బరిలో బీసీల నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‍తో పాటు ఇండిపెండెంట్‍గా బీఆర్‍ఎస్‍ పార్టీ నేత, కుడా మాజీ చైర్మన్‌ సుందర్‍రాజ్‍ యాదవ్‌ ఉన్నారు. టీపీటీఎఫ్‍ నుంచి వై.అశోక్‍ కుమార్‌ పోటీ చేస్తున్నారు. వివిధ సంఘాల నుంచి మరికొందరు బీసీలు సైతం బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు..

ఫిబ్రవరి 2న వరంగల్‌‌‌‌లో బీసీ రాజకీయ యుద్ధభేరి

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీసీలు గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయా పార్టీలో ప్రధాన పదవుల్లో ఉంటూనే బీసీ రిజర్వేషన్ల అమలు, టిక్కెట్ల కేటాయింపుపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీలతో పాటు త్వరలో జరిగే లోకల్‌ బాడీస్‌ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 2న గ్రేటర్‌ వరంగల్‌లో ‘బీసీ యుద్ధభేరి’ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్‌ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో లక్ష మందితో సభకు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నేతలు గడిచిన రెండు వారాలుగా ఏర్పాట్లు, సన్నాహక సమావేశాల్లో బిజీ అయ్యారు. 55 శాతంగా ఉన్న బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటన ప్రకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‍ అమలు చేయడమే లక్ష్యంగా నినదిస్తున్నారు. దీనికి తోడు ఓసీలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‍ రిజర్వేషన్‌ అమలు కారణంగా ఏటా 5 వేల నుంచి 10 వేల మంది బీసీ స్టూడెంట్లు ఇంజినీరింగ్‌, డాక్టర్‌ సీట్లు కోల్పోతున్నారని చెబుతున్నారు. బీసీ మేధావులు, ఉద్యోగులు, టీచర్ల కుల సంఘాలు జనవరి 25న హైదరాబాద్‍లో మీటింగ్‌ నిర్వహించారు. ప్రధాన పార్టీలు బీసీ క్యాండిడేట్లకు టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూనే.. బీసీ క్యాండిడేట్ల విజయం కోసం కృషి చేస్తామని 
ప్రకటించారు.