ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బుధవారం బీసీ సంఘాల నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్చేశారు. ఈ సందర్భంగా బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. కులగణన చేసి, బీసీల వాటా తేల్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి సాక్షిగా కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తాననడం బీసీల రాజకీయ అవకాశాలను తుంగలో తొక్కినట్లు అవుతుందన్నారు. రిజర్వేషన్లపై ఏమీ తేల్చకుండా ఎన్నికలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు.
బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రిలీజ్ చేసిన బీసీ డిక్లరేషన్ఏమైందని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పి, ఇప్పుడు మాట తప్పడం ముమ్మాటికి బీసీలను మోసం చేయడమేనన్నారు. బీసీలకు ఏటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చినాక మాట తప్పితే బీసీలు సహించరని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోఠి, బీసీ న్యాయవాదుల ఫోరం నేత గోవర్ధన్ యాదవ్, విద్యార్థి నాయకులు జక్కుల మధు యాదవ్, మోటపోతుల రమేష్ గౌడ్, అనిల్ ప్రజాపతి, బోనాల రాజు చారి, కొప్పుల అర్జున్, బొమ్మకంటి సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.