
- కాంగ్రెస్‌లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను
- ఒప్పుకునే పరిస్థితే లేదంటున్న బీసీ నేతలు
- కనీసం రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టు
- ఓసీ నేతల తీరుపై భగ్గుమంటున్న బీసీ లీడర్లు
- తమకు పదవులు రాకుండా అడ్డుపడ్తున్నారని ఆరోపణలు.. రేసులో పలువురు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు కూడా
- హైకమాండ్‌కు అగ్నిపరీక్షలా సీట్ల కేటాయింపు!
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌కే నాలుగు సీట్లు దక్కే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీలోని సీనియర్లంతా పదవులపై కన్నేశారు. మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పట్లాగే పలువురు ఓసీ లీడర్లు కర్చీఫ్ వేయగా.. సామాజిక సమీకరణాల ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు కూడా తేలాయి. బీసీలు ఏకంగా 56శాతం ఉండడంతో ఆ వర్గం నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఇదే అదనుగా కాంగ్రెస్ లోని బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు. తీన్మార్ మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో సహా బయటపెట్టగా, వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదం బలంగా పనిచేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ హైకమాండ్‌కు అగ్నిపరీక్షలా మారింది.
రెడ్డి, కమ్మ లీడర్ల తీవ్ర ప్రయత్నాలు
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసిన ఓసీ లీడర్లు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, అటు ఢిల్లీ పెద్దలను కలుస్తూ ఎలాగైనా పదవి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రేసులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీఎం సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అలాగే పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్ (కమ్మ), గాంధీ భవన్ ఇన్చార్జ్ కుమార్ రావు (వెలమ), ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్ రావు (బ్రాహ్మణ) ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫర్మ్ కాబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థల ద్వారా లీకులివ్వడాన్ని బీసీ నేతలు తప్పుపడ్తున్నారు.
ఓసీ నేతల ఆటలు ఇంకా సాగవని, ఇటీవల చేసిన కులగణన లెక్కల ప్రకారం తమ వాటా తమకు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటివరకు సైలెన్స్‌గా ఉన్నామని, ఇక తగ్గేదేలేదంటున్నారు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి హైకమాండ్‌ను రెండు ఎమ్మెల్సీలు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా శుక్రవారం గాంధీ భవన్ లో జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు తమ డిమాండ్ ఉంచాలనే ఆలోచనతో ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న బీసీల్లో సికింద్రాబాద్మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్సరితా యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తాను కూడా రేసులో ఉంటాననే సంకేతాలను పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధు యాష్కీ పంపించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి..
ఎస్సీ నుంచి రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాదిగ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాల నుంచి అద్దంకి దయాకర్ రేసులో ఉన్నారు. మైనార్టీల నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంపల్లి ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్, సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీల నుంచి విజయా బాయీ(వైరా నియోజకవర్గం) పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఈమె మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరురాలు. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్బెల్లయ్య నాయక్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
ఒక్క సీటు ఇవ్వాలంటున్న సీపీఐ
ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరుతుంది. అందులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును అడుగుతోంది. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కామ్రేడ్స్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఖాళీ అవుతున్న ఐదింటిలో మజ్లిస్ సీటు ఒకటి ఉంది. ఆ సీటును మళ్లీ వారే అడుగుతున్నారు. అయితే, ఆగస్టులో ఖాళీ కానున్న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటును మజ్లిస్ కు ఇస్తామని, ఇప్పుడు ఇవ్వలేమని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ఆ నలుగురు ఎవరనే దానిపై పీసీసీలో జోరుగా చర్చ సాగుతున్నది.
హైకమాండ్‌కు అగ్ని పరీక్ష
కాంగ్రెస్ కు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉండగా.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పార్టీ హైకమాండ్ కు అగ్ని పరీక్షలా మారింది. కాగా, బీసీ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో సీటు ఇస్తారనే చర్చ జరుగుతుండగా, రెండుకు తగ్గితే ఒప్పుకునే పరిస్థితి లేదని బీసీ నేతలు తెగేసి చెప్తున్న తీరు ఉత్కంఠ రేపుతున్నది.