![42 శాతం బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలి](https://static.v6velugu.com/uploads/2025/02/bc-welfare-association-alleges-manipulation-of-caste-census-data-in-telangana_QOPfVCGvyr.jpg)
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. వాస్తవాలకు విరుద్ధంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. బీసీల పొట్ట కొట్టి, ఓసీలను పెంచి పోషించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఆరోపించారు. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల జనాభా 56 శాతం ఉందని 1978 నుంచి చేసిన ప్రతి సర్వేలో తేలిందని.. కానీ ప్రస్తుతం 10 శాతం కోతపెట్టి 46 శాతంగా లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు.
6.5 శాతం ఉన్న ఓసీలను మాత్రం 16 శాతం చూపిస్తూ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకొనేందుకు లెక్కల గారడి చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కారని, 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 18 శాతానికి కుదించారని మండిపడ్డారు.
ఇప్పుడు మాత్రం తాము సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడో చేసి, వెబ్‌సైట్‌లో పెట్టామని ప్రగల్బాలు పలుకుతున్న బీఆర్ఎస్ నాయకులు.. అప్పుడేందుకు వాటి లెక్కలను బయటపెట్టలేదని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొల జనార్దన్, గోరిగ మల్లేశ్, సుధాకర్ ముదిరాజ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.