
- లేకపోతే ఉద్యమం తప్పదు: జాజుల
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా త్వరలో జరిగే జనగణనలో సమగ్ర కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని, దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ తెలంగాణ భవన్ లో బీసీ నేత బత్తుల సిద్దేశ్వర్ చేస్తున్న నిరవధిక నిరహార దీక్షకు జాజుల మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీ వైఖరి వల్ల బీసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బత్తుల ఆరోగ్యం క్షీణించక ముందే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని జాజుల విజ్ఞప్తి చేశారు.