మహిళా బిల్లులో బీసీలకుసబ్ కోటా కల్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

మహిళా బిల్లులో బీసీలకుసబ్ కోటా కల్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • లేకపోతే డిల్లీనీ దింగ్బంధిస్తాం: జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లులో బీసీలకు సబ్‌‌‌‌ కోటా కల్పించాలని, లేకపోతే ఢిల్లీని దిగ్భందిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల వల్ల మెజార్టీగా ఉన్న బీసీ మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఈ బిల్లు పూర్తిగా అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే తీసుకొచ్చారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌ రెడ్ హిల్స్‌‌‌‌లో ఉన్న ఎఫ్‌‌‌‌టీసీసీఐ (ప్యాప్సీ హౌస్)లో సగర ఉప్పర మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించారు. 

అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..అన్ని రంగాల్లో స్త్రీలు ముందు వరుసలో ఉన్నారన్నారు. 78 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో 94 మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే.. ఇందులో 54 మంది అగ్రకులాలకు చెందిన మహిళలు, 16 మంది ఎస్సీలు, 13 మంది ఎస్టీలు, నలుగురు మైనార్టీ మహిళలు ఉంటే, రాష్ట్రంలో 8 మంది మాత్రమే బీసీ మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళ సబ్ కోట పెట్టాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సబ్‌‌‌‌ కోటా ఉద్యమానికి మహిళలంతా సమ్మక్క సారాలమ్మ, రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.