కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి :  జాజుల శ్రీనివాస్  గౌడ్
  • బీసీలను కించపరుస్తూ దాడులు చేస్తున్నడు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే  అయి ఉండి కూడా తరచూ బడుగుబలహీన వర్గాలపై, బీసీ ప్రజా ప్రతినిధులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే కౌశిక్  రెడ్డిని అరెస్టు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్  డిమాండ్  చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని గురువారం బీసీ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్యకు జాజుల నివాళులర్పించి మాట్లాడారు. కొమురయ్య స్ఫూర్తితోనే రాష్ట్రంలో బీసీలందరూ ఐక్యం కావలసిన అవసరం ఉందన్నారు.

బీసీలపై దౌర్జన్యాలకు దిగుతున్న వారిని ఎదిరించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇటీవల  కరీంనగర్ లో జరిగిన జడ్పీ మీటింగ్ లో  బీసీ సామాజికవర్గానికి చెందిన జడ్పీటీసీ రవీందర్  ముదిరాజ్ ను కౌశిక్  రెడ్డి బూతులు  తిడుతూ అవమానించారని, ఆ సంఘటన బీసీలందరికీ అవమానకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తక్షణమే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని రక్షించడానికి బీఆర్ఎస్  పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ వ్యవహరించడం తగదన్నారు.  తప్పుచేసిన వారిని వెనుకేసుకు రావడం అన్యాయమని జాజుల ఫైర్  అయ్యారు.