కులగణనపై కుట్రలు తిప్పికొట్టాలి

  • బీసీలంతా కులగణనలో వివరాలు నమోదు చేసుకోవాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

వరంగల్/కాజీపేట, వెలుగు: కులగణనను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు, నేతలకు పుట్టగతులుండవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  మండిపడ్డారు. గురువారం కాజీపేట ఫాతిమా జంక్షన్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో చేపట్టిన కులగణన చైతన్య సదస్సు రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల లెక్కలు 60 శాతం వస్తే తమ పదవులు, పీఠాలు కదులుతాయని కొందరు అగ్రవర్ణాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కులగణనపై బీజేపీ, ఆ పార్టీ ప్రధాన నేతల వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

కులగణన సర్వేలో 56 ప్రశ్నలు ఉండగా, మరో 15 వాటికి అనుబంధంగా ఉన్నాయని చెప్పారు. అయితే 56 ప్రశ్నలు స్వతహాగా తెలంగాణ ప్రభుత్వం వేసేది కాదన్నారు. 1992లో సుప్రీంకోర్టు​ ఆదేశాల మేరకు ప్రభుత్వాలకు కేవలం ఒక్క కులంపై సర్వే చేసే హక్కు లేదన్నారు.  సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయంతో కూడిన కుల సర్వే మాత్రమే చేయాలనే తీర్పు ఆధారంగానే ఈ నమూనా తయారు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కులమే రేపటి బీసీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. సర్వే సందర్భంగా బీసీలంతా తమ కులం పేరు పక్కాగా చెప్పాలని, మిగతా 55 ప్రశ్నలకు ఏం చెప్పినా వచ్చే ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.​ సంక్షేమ పథకాలకు, సమగ్ర కులగణనకు ఎలాంటి సంబంధం లేదని.. ప్రజలు భయందోళనలు వీడాలన్నారు.

ఇతర అంశాల్లో పేపర్లు, టీవీల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసే రాష్ట్ర ప్రభుత్వం.. కులగణన విషయంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలపై ప్రచారం నిర్వహించడంలో విఫలమైందన్నారు. కులగణనపై కుట్ర చేసేటోళ్లే ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. 

రిటైర్డ్​ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని  కోరారు. రాజ్యాధికారం సాధించేంత వరకు ఉద్యమాలు కొనసాగాలన్నారు. కులగణనను బీసీ ప్రజలు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలను మోసం చేసినట్టే అవుతుందన్నారు. కులగణనను అడ్డుకోవాలని చూస్తూ దేనికైనా తెగిస్తామని నేతలు స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, తీగల ప్రదీప్​ కుమార్, రవి కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, దాడి మల్లయ్య, బచ్చు ఆనందం పాల్గొన్నారు.