పార్లమెంట్​లో బీసీ బిల్లును ఆమోదించాలి : శ్రీనివాస్ గౌడ్

పార్లమెంట్​లో బీసీ బిల్లును ఆమోదించాలి : శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ లో బీసీ బిల్లును ఆమోదించాలని, అందుకు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సూచించారు. గురువారం నల్గొండలోని సావిత్రిబాయి ఫూలే,  జ్యోతిరావుఫూలే బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలని కోరుతూ ఏప్రిల్ 2న తలపెట్టిన బీసీల పోరుగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ బిల్లులో ముస్లింలను చేర్చడాన్ని తప్పుపడుతూ బిల్లుకు ఆమోదం చేయకుండా బీజేపీ అడ్డుపడాలని చూస్తుందని, అదే జరిగితే బీసీల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత బీసీలదేనని తెలిపారు. అనంతరం ‘చలో ఢిల్లీ’ వాల్​పోస్టర్​ను ఆవిష్కరించారు.  

‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ని సక్సెస్ చేయాలి 

సూర్యాపేట, వెలుగు : ఏప్రిల్ 2న చేపట్టే ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ విధంగా దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీలు భారీగా తరలివచ్చి ఢిల్లీని ముట్టడించి, బీసీల సత్తా చాటాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు.