- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు బీసీల పక్షాన నిలబడి.. బీసీ బిల్లు పెట్టిస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కృష్ణయ్య సమావేశమయ్యారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి.. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు దృష్టి సారించి.. దీర్ఘకాలికంగా ఉన్న బీసీ డిమాండ్లపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కృష్ణయ్య కోరారు. కాగా, బీసీల డిమాండ్ల సాధన కోసం జనవరి చివరి వారంలో కృష్ణయ్య అధ్యక్షతన అమరావతి వేదికగా బీసీ మహాసభ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇన్ చార్జ్ ఎలగాల నూకనమ్మ యాదవ్ తెలిపారు.