వర్కర్లను ఓనర్లను చేసేందుకు చేయూత : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: బీసీ చేయూత స్కీమ్‌‌‌‌‌‌‌‌తో వర్కర్లు ఓనర్లుగా మారాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కులవృత్తులు, చేతివృత్తుల వారికి మంజూరైన రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ స్కీమ్ అమలులో దళారుల ప్రమేయం ఉండదని, ఎక్కడైనా ఈ పథకం కోసం డబ్బులు అడిగినా, ఇచ్చినట్లు తెలిసినా వెంటనే  వారికి  రద్దుచేసి అర్హులైన మరో లబ్దిదారుకు ఇస్తామని హెచ్చరించారు. ఇది బీసీ బంధు పథకం కాదని, బీసీ కులవృత్తుల చేయూత కార్యక్రమమని స్పష్టం చేశారు. 

చెక్కులు రానివారు నిరాశ చెందొద్దని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే రాజకీయ నాయకులను నమ్మొద్దని, గతంలో ఓట్లు వేయించుకొని ముఖం చాటేసిన రాజకీయ పార్టీలు మళ్లీ వస్తున్నాయని, వీరిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కరీంనగర్ నియోజకవర్గంలోని 705 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ వై.సునీల్‌‌‌‌‌‌‌‌రావు,  కలెక్టర్  డాక్టర్ బి. గోపి, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, లైబ్రరీ సంస్థ చైర్మన్​ అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, ఎంపీపీ లక్ష్మయ్య, శ్రీలత పాల్గొన్నారు.