సొంత బిల్డింగ్​ లేకుండానే బీసీ వెల్ఫేర్​ డిగ్రీ కాలేజీ ప్రారంభం

సొంత బిల్డింగ్​ లేకుండానే బీసీ వెల్ఫేర్​  డిగ్రీ కాలేజీ  ప్రారంభం

మహబూబ్​నగర్/చిన్నచింతకుంట, వెలుగు : దేవరకద్రకు మంజూరు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్​ బాయ్స్​ డిగ్రీ కాలేజ్  వేరే ప్రాంతానికి తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాలేజీని ప్రారంభించి ఐదు నెలలు అవుతున్నా సొంత బిల్డింగ్​ నిర్మించడం లేదు. మెయింటెనెన్స్​కు కూడా ఫండ్స్​ రిలీజ్​ కాలేదు. వచ్చే అకడమిక్​ ఇయర్​నాటికి బిల్డింగ్​ కంప్లీట్​కాకుంటే కాలేజీని వేరే జిల్లాకు తరలిస్తామని హయ్యర్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు​అంటున్నట్లు సంబంధిత అధికారులే చెబుతున్నారు. ఇదిలాఉంటే కాలేజీని ప్రారంభించినా మెయింటెనెన్స్, బిల్డింగ్​ కోసం ఫండ్స్​ రిలీజ్​ కాకపోవడంతో అసలు  కాలేజీ ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సొంత బిల్డింగ్​ లేకుండానే..

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్నారు. 2022–-23 విద్యా సంవత్సరంలో కాలేజీని ప్రభుత్వం మంజూరు​చేసింది. 8 కోర్సులను అందుబాటులోకి తెచ్చి, ఒక్కో సబ్జెక్టులో 40 మంది స్టూడెంట్స్​ చొప్పున 320 మందికి అడ్మిషన్లు ఇచ్చేలా కాలేజీకి అనుమతులు ఇచ్చింది. అయితే, సొంత బిల్డింగ్​ లేకపోవడంతో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్​ బాయ్స్​ రెసిడెన్షియల్​ స్కూల్​ బిల్డింగ్​లోని కొన్ని రూమ్స్​ కాలేజీకి కేటాయించారు. గత ఏడాది నవంబరు 30న మంత్రి శ్రీనివాస్​గౌడ్, పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి కాలేజీని ప్రారంభించారు.  కాలేజీ ఓపెనింగ్​కు ముందే సొంత బిల్డింగ్​ ఉండాలి. ఐదు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు సొంత బిల్డింగ్​ నిర్మించలేదు. రెవెన్యూ ఆఫీసర్లు దేవరకద్ర మండలం నాగారం వద్ద సర్వే నంబర్​ 177లో ఆరెకరాల భూమిని గుర్తించారు. కానీ, ఇప్పటి వరకు బిల్డింగ్​ పనులు ప్రారంభించలేదు. వచ్చే జూన్​ నాటికి బిల్డింగ్​ కంప్లీట్​ చేయకుంటే కాలేజీ వేరే జిల్లాకు షిఫ్ట్​ అయ్యే అవకాశం ఉండడంతో స్టూడెంట్స్, పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. 

‘దోస్త్’ అడ్మిషన్లు అంతంతే..

కాలేజీ ఏర్పాటు ఆలస్యం కావడంతో ఈ అకడమిక్​ ఇయర్​లో దోస్త్​ ద్వారా 56 మంది అప్లై చేసుకున్నారు. అందులో 26 మంది వేరే కాలేజీలకు వెళ్లిపోగా, మిగలిన 30 మంది కోసం లెక్చరర్లను ఏర్పాటు చేయలేక తుక్కుగూడ కాలేజీకి షిఫ్ట్​ చేశారు. ఇక దేవరకద్రకు మంజూరు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాయ్స్​ డిగ్రీ కాలేజీకి ఫండ్స్​ తెచ్చేందుకు జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి. కాలేజీ బిల్డింగ్, హాస్టల్, ఇతర సౌలతుల కోసం రూ.5 కోట్ల ఫండ్స్​ అవసరం. ఈ ఫండ్స్​ను తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్​తో జిల్లా నేతలు సంప్రదించడం లేదని అంటున్నారు.

డిగ్రీ చదువుకు దూరం..

ప్రభుత్వ కాలేజీలు లేకపోవడంతో దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల, అడ్డాకుల, మూసాపేట మండలాలకు చెందిన స్టూడెంట్లు పాలమూరుకు వచ్చి చదువుకుంటున్నారు. ఇబ్బందులు పడుతూ డిగ్రీ చదవలేక ఇంటర్ తోనే​చదువులు ఆపేస్తున్నారు. ఈ కాలేజీ ఏర్పాటుతో దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, కోయిల్​కొండలోని కొన్ని గ్రామాలు, నారాయణపేట జిల్లా మరికల్​ మండలానికి చెందిన స్టూడెంట్లకు ఇబ్బందులు దూరమవుతాయని భావించారు.

బిల్డింగ్​ ఉంటేనే కాలేజీ..

జ్యోతిబా ఫూలే బీసీ బాయ్స్​ డిగ్రీ కాలేజీలో 8 కోర్సులున్నాయి. ఈ అకడమిక్​ ఇయర్​లో దోస్త్  ద్వారా 30 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో వారిని మహేశ్వరం గేట్​ వద్ద ఉన్న కాలేజీకి పంపించాం. వచ్చే అకడమిక్​ ఇయర్​ ప్రారంభం నాటికి కాలేజీకి బిల్డింగ్​ కట్టించాల్సి ఉంది. 
– అమరేశ్​పటేల్, ఇన్​చార్జి ప్రిన్సిపాల్, దేవరకద్ర 

సర్వే చేశాం..

బాయ్స్​ డిగ్రీ కాలేజీ బిల్డింగ్​ కోసం ప్రభుత్వ స్థలం చూయించాలని చెప్పారు. నాగారం వద్ద సర్వే నంబర్​ 177లో ఆరెకరాల భూమి గుర్తించాం. ఈ రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేశాం.  
‌‌‌‌– జ్యోతి, తహసీల్దార్, దేవరకద్ర