- 50 ఏళ్ల దరిద్రాన్ని తుడిచేశాం
- కాంగ్రెస్ తో కుమ్మక్కయి బై ఎలక్షన్ లో ఈటల గెలిచిండు
- ఈటలను ఓడించేందుకు కుట్ర చేశారనడంలో నిజం లేదు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : అభివృద్ధికి మారుపేరుగా కరీంనగర్ సిటీని తీర్చిదిద్దామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సిటీలోని తన ఆఫీసులో మంగళవారం విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ కరీంనగర్ కు పట్టిన 40, 50 ఏళ్ల దరిద్రాన్ని తుడిచేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. తనను నాలుగోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే సీఎం కేసీఆర్ చేతిలోనే తెలంగాణ ఉండాలన్నారు. కేసీఆర్ కు ఇష్టమైన నగరం కరీంనగర్ అని చెప్పారు. పదేళ్లలో నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.
ఐటీ టవర్, టీటీడీ, ఇస్కాన్ టెంపుల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రావడంతో నగర ప్రాశస్త్యం పెరిగిందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ను ఏడాదిలోగా పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు. కరీంనగర్ అభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అధికారమిస్తే 1956లో జరిగినట్లు మళ్లీ తెలంగాణ, ఆంధ్ర విలీనం జరుగుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ తో కుమ్మక్కయి ఈటల గెలిచిండు..
2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి కమలాకర్ అన్నారు. కేసీఆర్ ఫొటోతో గెలిచి, పదవులు అనుభవించిన ఈటల ఇప్పుడు కేసీఆర్ పై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. హుజూరాబాద్ బైఎలక్షన్ లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యే ఈటల గెలిచారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఫొటో లేకుండా గెలవగలవా అని సవాల్ విసిరారు.
నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రజాఆశీర్వాద సభ..
కరీంనగర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బుధవారం ఉదయం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలు భారీగా పాల్గొనాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. తాను వచ్చే నెల 9న నామినేషన్ వేస్తానని, 10న మరో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. ప్రతి ఎలక్షన్ లాగే ఈసారి కూడా బొమ్మకల్ హనుమాన్ టెంపుల్ నుంచి గురువారం ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.
అనంతరం పద్మనగర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద నిర్వహించే ఆశీర్వాద సభ స్థలాన్ని మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు పరిశీలించారు. ఆయన వెంట పార్టీ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహిపాల్, కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.