సైదాపూర్/చిగురుమామిడి, వెలుగు : జనవరిలో రైతుభరోసా అందే అవకాశం ఉందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రైతు భరోసాపై చర్చ జరిగిందని, ఈ విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సైదాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాపై అసెంబ్లీలోనూ చర్చ జరిగిందని, జనవరిలో పంటలు వేసే టైంలో అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. యాసంగిలో విత్తనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2024-–25 యాసంగి కోసం ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కింద కరీంనగర్ జిల్లా మానకొండూరు, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, హుజురాబాద్‌తో పాటు దిగువన ఉన్న ప్రాంతాల్లోని 6,97,708 ఎకరాలకు మొత్తం 44.480 టీఎంసీల నీటిని కేటాయించనున్నట్టు చెప్పారు. అనంతరం చిగురుమామిడిలో కేజీబీవీ స్కూల్‌ను సందర్శించి, సగం మంది టీచర్లు సమ్మెలో ఉండడంతో మిగిలిన వారు తరగతులు సరిగ్గా జరిగేలా చూసుకోవాలని చెప్పారు. పరీక్షలు దగ్గర పడుతున్న టైంలో సమ్మెకు దిగడం సరికాదని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, టీచర్లు సమ్మె విరమించి డ్యూటీలో చేరాలని కోరారు. స్కూల్‌లో వంటగది, పరిసరాలు, వంటల గురించి అడిగి తెలుసుకున్నారు.