సూర్యాపేట, వెలుగు: మొబైల్ ఫోన్ చూస్తోందని స్టూడెంట్ ను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట బీసీ బాలికల సంక్షేమ హాస్టల్‌ను శుక్రవారం రాత్రి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనసూయ తనిఖీ చేశారు. ఆ సమయంలో పారా మెడికల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మొబైల్ చూస్తూ ఆమెను గమనించకపోవడంతో, స్టూడెంట్ వద్దకు వచ్చిన ఆఫీసర్ మొబైల్ ను లాక్కొని చేయి చేసుకుంది.
తోటి స్టూడెంట్స్ వారించినా కొట్టగా, వార్డెన్ వచ్చి ఆఫీసర్ ను అక్కడి నుండి పంపించారు. గాయపడిన స్టూడెంట్ ను వార్డెన్ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి హాస్టల్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శనివారం హాస్టల్ వద్ద ఆందోళనకు దిగడంతో సదరు ఆఫీసర్ అక్కడికి చేరుకొని స్టూడెంట్ కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.