జమ్మికుంట, వెలుగు: ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్రంలోని అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జమ్మికుంటలోని నాగంపేట సర్కిల్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పొన్నం మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న బీజేపీ హామీని నిలబెట్టుకోలేకపోయిందని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదన్నారు. బండి సంజయ్ నియోజకవర్గంలో తిరగక, అభివృద్ధి చేయక కేవలం అక్షింతలు పంచి రాముడి ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేసి వృథా చేయొద్దన్నారు. మోదీ ‘ఏక్ బార్ చార్ సౌ’ అంటున్నారని, రాజ్యాంగం మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేసి, అంబే ద్కర్ విగ్రహాలను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆటో ట్రాలీలో జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌కు వెళ్తున్న మహిళ లతో మాట్లాడారు. ప్రచారంలో హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి, పుల్లూరు సదానందం, సారంగపాణి, సాయిని రవి, సజ్జు పాల్గొన్నారు.