Shakib Al Hasan: మర్డర్ కేసులో ఇరుక్కున్నా షకీబ్ క్రికెట్ ఆడతాడు: బంగ్లా క్రికెట్ బోర్డు

Shakib Al Hasan: మర్డర్ కేసులో ఇరుక్కున్నా షకీబ్ క్రికెట్ ఆడతాడు: బంగ్లా క్రికెట్ బోర్డు

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, అవామీ లీగ్ మాజీ శాసనసభ్యుడు షకీబ్ అల్ హసన్‌పై అడాబోర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఢాకాలో అతనిపై హత్య కేసు నమోదు చేయడంతో పెద్ద చిక్కుల్లో పడ్డాడని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్‌ను హత్య చేయాలని ఆదేశించినట్లు షకీబ్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో షకీబ్ క్రికెట్ కెరీర్ ముగిసిందని కొంతమంది భావించారు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షకీబ్ క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంది.    

హత్య కేసుకు సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో షకీబ్ పేరు ఉన్నప్పటికీ.. అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. చట్టపరమైన కేసులో షకీబ్ ప్రమేయం ఉన్నప్పటికీ.. దోషిగా నిరూపించబడే వరకు షకీబ్‌ని జాతీయ జట్టు కోసం ఆడతాడని బీసీబీ నిర్ణయించింది. ప్రస్తుతం షకీబ్ పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రావల్పిండి వేదికగా ఆడుతున్న తొలి టెస్ట్ లో అతనిపై ఈ ఆరోపణలు వచ్చాయి. 

ALSO READ | బంగ్లాదేశ్‎పై ఓటమి ఎఫెక్ట్.. షాహిన్ ఆఫ్రిదికి పీసీబీ షాక్

ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా, రోడ్డు రవాణా, వంతెనల శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్ సహా 156 మంది నిందితులుగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 400-500 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారట.  ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 5 న అడాబోర్‌ రింగ్ రోడ్‌లో నిరసన ప్రదర్శనలో రూబెల్ పాల్గొన్నాడు. ర్యాలీ సమయంలో ఎవరో ఒక ప్రణాళికా బద్ధంగా గుంపుపైకి కాల్పులు జరిపారని.. దీని ఫలితంగా రూబెల్ ఛాతీ, పొత్తికడుపులో అతన్ని కొట్టారని ఆరోపించారు.