నచ్చిన లీగ్‌లో ఆడండి.. ఆటను మెరుగు పరుచుకోండి: క్రికెటర్లకు బంగ్లా బోర్డు బంపరాఫర్

నచ్చిన లీగ్‌లో ఆడండి.. ఆటను మెరుగు పరుచుకోండి: క్రికెటర్లకు బంగ్లా బోర్డు బంపరాఫర్

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తెలివైన నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల క్రికెట్ బోర్డుల వలే ఆటగాళ్లు దేశానికే ఆడాలి, దేశవాళీ టోర్నీల్లో సత్తా నిరూపించుకోవాలి అని పట్టబట్టకుండా సరైన నిర్ణయం తీసుకుంది. బహుళ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొనడానికి పలువురు జాతీయ క్రికెటర్లకు అనుమతి(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌(NOC)) మంజూరు చేసింది. అందుకోసం, వర్షాన్ని సాకుగా చూపి.. అఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌లను వాయిదా వేసుకుంది.

వాస్తవానికి బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య గ్రేటర్ నోయిడా(ఇండియా) వేదికగా జూలై 25 మరియు ఆగస్టు 6 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లకు వర్షం ముప్పు ఉన్నట్లు వచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకొని వాయిదా వేసుకున్నట్లు బీసీబీ క్రికెట్ కార్యకలాపాల ఇన్‌ఛార్జ్ షహరియార్ నఫీస్ క్రిక్‌బజ్‌తో అన్నారు. రీషెడ్యూల్ చేయడానికి ఇరు దేశాల బోర్డులు అంగీకరించడంతో పలువురు క్రికెటర్లకు NOCలు అందించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

ఫ్రాంచైజీ క్రికెట్ ఆడి మెరుగు పడండి!

ఈ సిరీస్‌ల వాయిదాకు వర్షాన్ని ఒక సాకుగా చూపారన్న మాటలు వినపడుతున్నాయి. దేశానికే ఆడాలి, దేశవాళీ టోర్నీల్లో రాణించాలి అని కట్టడి చేయడం ఇష్టం లేక బీసీబీ ఈ నిర్ణయం తీసుకుందని బంగ్లా బోర్డులోని కొందరు పెద్దలు అంటున్నారు. 'నచ్చిన ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడండి.. ఆటను మెరుగు పరుచుకోండి..' అని బీసీబీ ఆటగాళ్లకు సూచించినట్లు బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పలువురు విదేశీ క్రికెటర్లు పాల్గొంటారు. తద్వారా మెళుకువలు నేర్చుకోవడానికి ఆటగాళ్లకు మంచి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడే బంగ్లా క్రికెటర్లు

  • తస్కిన్ అహ్మద్‌- కొలంబో స్ట్రైకర్స్ (లంక ప్రీమియర్ లీగ్‌)
  • తౌహిద్ హృదయ్ - దంబుల్లా సిక్సర్‌ (లంక ప్రీమియర్ లీగ్‌)
  • ముస్తాఫిజుర్ రెహమాన్‌- దంబుల్లా సిక్సర్‌ (లంక ప్రీమియర్ లీగ్‌)
  • షకీబ్ అల్ హసన్-  బంగ్లా టైగర్స్ మిస్సిసాగువా (గ్లోబల్ టి20 కెనడా లీగ్‌)  
  • షోరీఫుల్ ఇస్లామ్‌- బంగ్లా టైగర్స్ మిస్సిసాగువా (గ్లోబల్ టి20 కెనడా లీగ్‌) 
  • మహ్మద్ సైఫుద్దీన్- మాంట్రియల్ టైగర్స్ (గ్లోబల్ టి20 కెనడా లీగ్‌) 
  • రిషాద్ హొస్సేన్- టొరంటో నేషనల్స్‌ (గ్లోబల్ టి20 కెనడా లీగ్‌)  
  • షకీబ్ అల్ హసన్- లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్(మేజర్ లీగ్ క్రికెట్‌)