IND vs AUS: మరికొన్ని గంటల్లో తొలి టెస్ట్.. భారత జట్టులోకి కర్ణాటక బ్యాటర్‌

IND vs AUS: మరికొన్ని గంటల్లో తొలి టెస్ట్.. భారత జట్టులోకి కర్ణాటక బ్యాటర్‌

కంగారులతో తాడో పేడో తేల్చుకోవడానికి సమయం ఆసన్నమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం(నవంబర్ 22) నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ షురూ కానుండగా.. బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 

టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌ సేవలను కోల్పోవడంతో భారత మేనేజ్మెంట్ యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టులో చేర్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా రోహిత్ దూరమవ్వగా.. ప్రాక్టీస్ గేమ్‌లో గిల్ బొటనవేలికి గాయం కావడంతో అతను ఆడేది అనుమానంగా మారింది. దాంతో, జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే మరొక ఓపెనర్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలోనే బీసీసీఐ చివరి నిమిషంలో పడిక్కల్‌ను జట్టులో చేర్చింది. అయితే, తుది జట్టులో ఉంటాడా..! అనేది అనుమానమే. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ లేదా కేఎల్ రాహుల్‌లలో ఒకరు ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది.

'దేవదత్ పడిక్కల్ భారత జట్టులో చేరాడు..' అని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.

   
ఈ 24 ఏళ్ల కర్ణాటక బ్యాటర్ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అక్కడ నిలకడగా రాణించకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈమధ్య దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో అదృష్టం మరోసారి తలుపు తట్టింది.