న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే ఇండియా అథ్లెట్లకు బీసీసీఐ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. వివిధ రకాల ఈవెంట్లలో పాల్గొనే అథ్లెట్ల కోసం రూ. 8.5 కోట్లను ఐవోఏకు ఇవ్వనుంది. ‘పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా అథ్లెట్లకు మేం మద్దతుగా నిలుస్తాం. వాళ్లకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించడానికి బీసీసీఐ రెడీగా ఉంది. ఇందుకోసం రూ. 8.5 కోట్లు కేటాయించాం. గేమ్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు. ఇండియా గర్వించేలా మెడల్స్ గెలవాలని ఆకాంక్షిస్తున్నాం’ అని జై షా ట్వీట్ చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున మొత్తం 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. మరోవైపు శ్రీలంక టూర్‌లో పాల్గొనే టీమిండియాకు సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గత మూడేళ్లుగా బెంగళూరులోని ఎన్‌సీఏలో పని చేస్తున్న అతను లక్ష్మణ్, ద్రవిడ్ కాలంలో ఇండియా–ఎ, టీమిండియాకు సపోర్ట్ స్టాఫ్‌గా సేవలందించాడు.