టెస్టు క్రికెటర్లకు ఇన్సెంటివ్ స్కీమ్

టెస్టు క్రికెటర్లకు ఇన్సెంటివ్ స్కీమ్
  •     సీజన్‌‌లో 75% టెస్టులు ఆడే వారికి  
  •     మ్యాచ్‌‌కు రూ. 45 లక్షల ప్రోత్సాహకం
     

న్యూఢిల్లీ:  టెస్టు క్రికెట్‌‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్న బీసీసీఐ ఇండియా సీనియర్ మెన్స్‌‌ కోసం ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్‌‌’ను తీసుకొచ్చింది. ఒక సీజన్‌‌లో ఇండియా పోటీపడే టెస్టుల్లో 75 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడే క్రికెటర్లకు మ్యాచ్‌‌కు రూ. 45 లక్షల చొప్పున ఇన్సెంటివ్‌‌ ఇస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా శనివారం తెలిపారు. సీజన్‌‌లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడే ప్లేయర్లు మ్యాచ్‌‌కు రూ. 30 లక్షల ఇన్సెంటివ్ అందుకుంటారని వెల్లడించారు. 

అత్యుత్తమ ఫార్మాట్ ఆడే క్రికెటర్లను ప్రోత్సహించేందుకు, అలాంటి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ స్కీమ్ తెచ్చినట్టు జై షా చెప్పారు.  2022–23 సీజన్‌‌ నుంచే దీన్ని అమలు పరుస్తామని, ఒక టెస్టుకు మ్యాచ్ ఫీజుగా ఇచ్చే రూ. 15 లక్షలకు అదనంగా ఇన్సెంటివ్‌‌ను క్రికెటర్లకు అందిస్తామని తెలిపారు. 
 

పది టెస్టులు ఆడితే రూ. 6  కోట్లు
 

ఈ  స్కీమ్ ప్రకారం ఒక సీజన్‌‌లో పది టెస్టులు ఆడే క్రికెటర్‌‌‌‌కు ఒక్కో  మ్యాచ్‌‌కు రూ. 15 లక్షల ఫీజుతో పాటు రూ. 4.5 కోట్ల ఇన్సెంటివ్ లభిస్తుంది. ఈ లెక్కన అతను మొత్తం ఆరు కోట్లు అందుకుంటాడు.  2023–24 సీజన్‌‌లో ఇండియా ఆడిన పది టెస్టులో పాల్గొన్న రోహిత్ ఖాతాలో ఆరు కోట్లు చేరున్నాయి.