Women's T20 World Cup 2025: అండర్ 19 టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు

Women's T20 World Cup 2025: అండర్ 19 టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు

వచ్చే ఏడాది మలేషియా వేదికగా జరగనున్న మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ కు బీసీసీఐ భారత జట్టును  ప్రకటించింది. నిక్కీ ప్రసాద్ సారధ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం వెల్లడించింది. నిక్కీ ప్రసాద్‌కు డిప్యూటీగా సానికా చల్కేను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు చోటు దక్కడం గమనార్హం. 

హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్టణానికి చెందిన షబ్నమ్‌ అండర్ 19 ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మహిళల అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భద్రాచలం(తెలంగాణ) బిడ్డ గొంగడి త్రిష స్టార్‌గా నిలిచింది. 19 ఏళ్ల త్రిష ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో 53 సగటుతో, 120.45 స్ట్రైక్ రేట్‌తో 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఫైనల్లోనూ త్రిష(52) హాఫ్ సెంచరీ చేసింది.

Also Read :- మెరిసిన తెలంగాణ బిడ్డ

భారత U19 జట్టు: నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కమలిని (వికెట్ కీపర్), భావికా అహిరే (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, షబ్నం, వైష్ణవి.

స్టాండ్‌బై ప్లేయర్స్: నందన, ఐరా, అనధి.

U19 మహిళల ప్రపంచ కప్‌ వివరాలు.. 

ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది జనవరి 18 నుండి ఫిబ్రవరి 2 వరకు మలేషియాలో జరగనుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మూడు జట్లు సూపర్ సిక్స్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

క్వాలిఫై అయిన 12 జట్లను సూపర్ సిక్స్ రౌండ్‌లో ఆరు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఈ దశలో సాధించిన విజ్స్యల ఆధారంగా ఒక్కో గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్, ఆతిథ్య మలేషియా, వెస్టిండీస్, శ్రీలంక జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లను ఆడనుంది.