జూన్ 12 నుంచి హాంకాంగ్ వేదికగా జరగనున్న ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్- 2023 టోర్నీకి భారత ఎమర్జింగ్ 'ఎ' జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు శ్వేతా సెహ్రావత్ నాయకత్వం వహించనుండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన గొంగడి త్రిషా, బారెడ్డి మల్లి అనూష జట్టులో చోటు దక్కించుకున్నారు.
తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఇప్పటికే భారత అండర్-19 జట్టు తరపున ఆడిన విషయం తెలిసిందే. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష, బ్యాటింగ్‌లోనూ రాణించగలదు. మరోవైపు ఆంధ్రాకు చెందిన యువ పేసర్ బారెడ్డి అనూష ఇటీవల జరిగిన అండర్-16 టోర్నీలో అద్భుతంగా రాణించడంతో ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికచేశారు. జూన్-12 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ఈ జట్లను ఏ, బి అను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్‌తో పాటు హాంకాంగ్, థాయిలాండ్ 'ఎ', పాకిస్తాన్ 'ఎ' జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. బంగ్లాదేశ్ 'ఎ', శ్రీలంక 'ఎ', మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి.
ఇండియా ఎమర్జింగ్ 'ఎ' జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), టిటాస్ సాధు, యశశ్రీ, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష.
కోచ్: నూషిన్ అల్ ఖదీర్
భారత 'ఎ' జట్టు షెడ్యూల్:
జూన్ 13: ఇండియా 'ఎ' vs హాంకాంగ్
జూన్ 15: ఇండియా 'ఎ' vs థాయ్‌లాండ్ 'ఎ'
జూన్ 17: ఇండియా 'ఎ' vs పాకిస్తాన్ 'ఎ'