హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. కరోనా కారణంగా ఈ వేడుక గత మూడు సంవత్సరాలుగా జరగలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ అవార్డుల వేడుకను జరిపేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ వేడుకకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేశారు. మంగళవారం (జనవరి 23) ఈ గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లాండ్  క్రికెట్ జట్టు 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. జనవరి 25 నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ జట్టుని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం ఉంది.   

దేశంలోని అత్యుత్తమ క్రికెటర్ల సక్సెస్ స్టోరీల్ని గుర్తించి ఆ ఆటగాళ్లను గౌరవించే వేదిక బీసీసీఐ అవార్డుల కార్యక్రమమని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. బీసీసీఐ వార్షిక అవార్డులకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానముంటుందని చెప్పారు. క్రికెట్ హీరోల్ని అందించడంలో ఇప్పటి వరకూ అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం చివరిసారిగా 2020 జనవరిలో ముంబై వేదికగా జరిగింది. 2018-19 క్రికెట్ ఏడాదికి అత్యుత్తమ ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చింది. పురుషుల జట్టులో జస్‌ప్రీత్ బూమ్రా,  మహిళల జట్టులో పూనమ్ యాదవ్‌లకు అవార్డు దక్కింది.

జనవరి 23 న సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇటీవలే భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 న హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. మ్యాచ్ లన్నీ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు జరుగుతాయి.